Israel Attack On Lebanon : పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్-ఇజ్రాయెల్ పోరు, ఇప్పుడు లెబనాన్ వైపునకు మళ్లింది. మంగళవారం పేజర్ల పేలుళ్లు, బుధవారం వాకీటాకీల పేలుళ్లు, శుక్రవారం హెజ్‌బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీస్థాయికి చేరిన ఉద్రిక్తతలు సోమవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ సోమవారం భీకరస్థాయిలో విరుచుకుపడింది. సైదా, మరజుయాన్, టైర్, జహరానితో బెకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 492 మంది మృతి చెందారు. 1645 మంది గాయాల పాలయ్యారని లెబనాన్ ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు. మృతుల్లో 35 మంది చిన్నారులు, 58 మహిళలు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు.
ప్రాణాలు అరచేత పట్టుకుని
ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్‌లోని గ్రామాలు వణికిపోయాయి. వేల మంది పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాల్లో బీరుట్‌వైపు పారిపోవడం ప్రారంభించారు. దాంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. హెజ్‌బొల్లాకు చెందిన దాదాపు 1300 లక్ష్యాలను ఢీకొట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్‌బొల్లా క్షిపణుల నిర్వీర్యమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. 2006లో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య జరుగుతున్న అతి పెద్ద ఘర్షణ ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన రెండు సైనిక స్థావరాలపై తాము 125 రాకెట్లను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా తెలిపింది.
దాడులు ఆపే ప్రసక్తే లేదు
లెబనాన్‌పై తమ దాడుల పరంపర ఆగదని ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. హెజ్‌బొల్లా ఆయుధాలను దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ప్రకటించింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తెలిపారు. తమ హెచ్చరికను లెబనాన్ పౌరులు తీవ్రంగా తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సాయంతో ఈ బెకా లోయలోనే హెజ్‌బొల్లా 1982లో ఆవిర్భవించింది.
హెజ్‌బొల్లా మరో సీనియర్ కమాండర్ లక్ష్యంగా దాడి!
దక్షిణ లెబనాన్‌తో పాటు బీరుట్‌పైనా ఇజ్రాయెల్ దాడి చేసింది. సదరన్ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ హెజ్‌బొల్లా కమాండర్ అలీ కరాకీ లక్ష్యంగా ఈ దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆయనకు ఏమైందన్న విషయం మాత్రం తెలియలేదు. కరాకీ వివరాలు తెలియడం లేదని హెజ్‌బొల్లా వర్గాలు కూడా చెబుతున్నాయి.
పశ్చిమాసియాకు అమెరికా బలగాలు
ఈ ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపాలని అమెరికా నిర్ణయించింది. ఇది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని పెంటగాన్ తెలిపింది. లెబనాన్ మరో గాజా కానుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఉద్రిక్తతలు ఆపాల్సిన అవసరం ఉందని, లేకపోతే యుద్ధం పశ్చిమాసియాలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.