Reasons for Chips Packets Filled with Air : చిప్స్ తినడం ఆరోగ్యమా? అనారోగ్యమా? అనే విషయం పక్కనబెడితే.. పిల్లల నుంచి పెద్దల వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుందంటూ.. లాగిస్తుంటారు. అయితే.. ఈ చిప్స్ ప్యాకెట్లు చూడడానికి ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి. కానీ.. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం లోపల గాలే ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సిన చిప్స్ కేవలం కొన్నే ఉంటాయి. మరి.. అసలు చిప్స్(Chips) ప్యాకెట్లలో గాలి ఎందుకు ఉంటుంది? అందుకు గల కారణాలేంటి? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపడం వెనుక దాగి ఉన్న కారణాలను వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో "డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య" ఈ విధంగా వివరిస్తున్నారు. చిప్స్ రోజులపాటు నిల్వ ఉంటాయి. కాబట్టి.. వాటిని నార్మల్గా ప్యాక్ చేస్తే బ్యాక్టీరియా వ్యాపించి అవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. ఆ చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారని రామచంద్రయ్య చెబుతున్నారు.
దీనివల్ల.. ప్యాకెట్లోకి బ్యాక్టీరియా లాంటి కుళ్లబెట్టే క్రిములు చొరబడకుండా ఉండటంతోపాటు వినియోగదారుడికి ప్యాకెట్ పెద్ద సైజులో కనిపిస్తుండడంతో.. వీటిని తయారు చేసే కంపెనీలు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. అందుకే.. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువును తగిన పీడనంలో నింపుతారు. నైట్రోజన్ అనేది ఒక జడవాయువు. అందువల్ల ఈ వాయువు ఉన్నచోట బ్యాక్టీరియా సంబంధిత జీవులు నివసించలేవు. పైగా.. పొడి నత్రజని కావడం వల్ల నీటి ఆవిరి కూడా ఉండదని.. ఫలితంగా చిప్స్ కరకరలాడుతూ ఎక్కువకాలం నిల్వ ఉంటాయని చెబుతున్నారు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య.
అయితే.. ఇక్కడ మీకు ఒక డౌట్ రావొచ్చు. నైట్రోజన్కు బదులుగా ఆక్సిజన్ ఎందుకు నింపకూడదు అని! దానికీ ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఆక్సిజన్ అనేది ఆహారంలోని పదార్థాలతో చర్య జరిపే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి.. చిప్స్ ప్యాకెట్లలో ఆక్సిజన్ నింపితే.. అవి త్వరగా పాడైపోతాయి. అందుకే.. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ అనే జడవాయువును నింపుతారని చెబుతున్నారు.
ఇదేకాకుండా.. చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపడం వెనుక మరో కారణం దాగి ఉందట. అదేంటంటే.. ప్యాకెట్లలో గాలి లేకపోతే.. ట్రాన్స్పోర్ట్ టైమ్లో వాటి మీద ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల అవి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి.. రవాణా సురక్షితంగా జరగాలన్నా.. చిప్స్ ప్యాకెట్లలో గాలి నింపడం అనివార్యంగా చెబుతున్నారు. సో.. ఇదన్నమాట ప్యాకెట్లో గాలి ముచ్చట!
ఇవీ చదవండి :
ఆయిల్ లేకుండా చిప్స్, అప్పడాలు ఇలా వేయించండి - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
బిగ్ అలర్ట్ : మీకు ఈ చిప్స్ తినే అలవాటు ఉందా? - మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి!