Psychiatrist Advice for Confused Patients: "పెద్దయ్యాక.. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటా" "ఎదిగిన తర్వాత.. మా అమ్మాయిని మీ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తా" అంటూ.. పెద్దవాళ్లు అనడం మనం చూస్తూనే ఉంటాం. బంధువులు, మిత్రులు ఇలా అనుకుంటూ ఉంటారు. కొందరు సరదాకు అనుకున్నా.. మరికొందరు సీరియస్‌గా తీసుకుంటారు. ఇలా పెద్దలు సరదాకు అనుకున్న మాటవల్ల ఓ యువతి సమస్యను ఎదుర్కొంటోంది. సహాయం చేయండని నిపుణులను కోరాల్సిన పరిస్థితికి వచ్చింది. మరి ఆమె సమస్య ఏంటి? దానికి నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
నగరంలో ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారి కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. బంధువులకన్నా బలమైన బంధం ఏర్పడింది. రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందులో ఒక కుటుంబానికి అమ్మాయి ఉంది. మరో కుటుంబానికి అబ్బాయి ఉన్నాడు. ఈ క్రమంలోనే.. ఓ సందర్భంలో "మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటా" అన్నారు అబ్బాయి తల్లి. దీనికి అమ్మాయి కుటుంబసభ్యులు నవ్వేసి.. అలాగే చేసుకోండి అన్నారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం గురించి వదిలేశారు. కానీ.. అబ్బాయి మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడేమో.. అప్పట్నుంచి ఆ అమ్మాయిపై ఆంక్షలు పెడుతూ వస్తున్నాడు. నువ్వు వాళ్లతో మాట్లాడొద్దు.. వీళ్లతో చనువుగా ఉండొద్దు.. అలాంటి బట్టలు వేసుకోవద్దు.. అంటూ ఆమె నడవడికను డిసైడ్ చేసేలా మాట్లాడుతున్నాడు. ఇది తనకు నచ్చట్లేదని అమ్మాయి ఆవేదన చెందుతోంది. ఒకవేళ రియాక్ట్ అయితే.. కుటుంబాల మధ్య ఉన్న స్నేహం దెబ్బ తింటుందేమో అని భయపడుతోంది. అందుకే.. ఏం చేయాలో అర్థం కావడం లేదని నిపుణుల సలహా అడిగింది. మరి.. ఈ సమస్యకు ప్రముఖ మానసిక నిపుణురాలు స్వాతి పైడిపాటి ఎలాంటి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
"ఫ్యామిలీ ఫ్రెండ్స్ సరదాగా, కుటుంబంలా మెలిగితే ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. అలా అని అతిచొరవ తీసుకుని అసందర్భంగా మాట్లాడితే అంతే చిరాకు తెప్పిస్తుంది. ఇలా చదువుకునే పిల్లల దగ్గర వివాహం గురించి మాట్లాడటం వివేకమైన పనికాదు. మీ ఆంటీ మనస్ఫూర్తిగా అన్నా, మాటవరసకే అన్నా, ఎలా చెప్పినా సరే... వాళ్లబ్బాయి నీతో ప్రవర్తించే తీరు మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆ అబ్బాయి నీతో ప్రవర్తించిన తీరు గురించి ముందు మీ అమ్మానాన్నలకు చెప్పండి. ఆ అబ్బాయి ప్రవర్తన వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో.. అది నీ మనసుకి ఎంత కష్టంగా ఉందో వారికి అర్థమయ్యేలా వివరించు. తర్వాత వాళ్లే అతడి తల్లిదండ్రులతో సున్నితంగా చెప్పుకుంటారు. ఇరు కుటుంబాల మధ్యా స్నేహం చెడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తారు."
-డాక్టర్ స్వాతి పైడిపాటి, మానసిక నిపుణురాలు
ఒకవేళ అబ్బాయి పేరెంట్స్‌తో మాట్లాడడానికి మీ తల్లిదండ్రులు మొహమాటపడితే.. అప్పుడు నువ్వే నేరుగా వెళ్లి మీ ఆంటీతో మాట్లాడాలని స్వాతి సూచించారు. అది కూడా సున్నితంగా డీల్ చేయాలని చెప్పారు. "నాకున్న లక్ష్యాలు, ఆశయాలు నెరవేర్చుకునే వరకు పెళ్లి ఆలోచన లేదు. అవి సాధించుకున్న తర్వాత అప్పటి పరిస్థితులు, ఇష్టాయిష్టాలను బట్టి పెళ్లిపై నిర్ణయం తీసుకుంటా. ఈ విషయం మీ అబ్బాయికి మీరే అర్థం చేయించండి" అని సున్నితంగా చెప్పాలని సూచించారు. అతడిలో మార్పు వస్తే స్నేహం కొనసాగించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల రెండు కుటుంబాల మధ్య స్నేహం పాడవకుండా ఉంటుందని డాక్టర్ స్వాతి సలహా ఇచ్చారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.