Benjamin Netanyahu Warns Lebanese : హమాస్ లెబనాన్ ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటుందోని, కనుక లెబనీస్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. వాస్తవానికి హమాస్-ఇజ్రాయెల్ పోరుతో పశ్చిమాసియా రక్తసిక్తం అవుతోంది. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా సైదా, మరజుయాన్, టైర్, జహరానితో బెకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. దీంతో ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దాడుల నేపథ్యంలోనే లెబనాన్ పౌరులను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశం విడుదల చేశారు. హెజ్‌బొల్లాకు మానవ కవచాలుగా మారొద్దని హెచ్చరించారు.
"మా యుద్ధం మీతో కాదు. హెజ్‌బొల్లాతోనే! చాలా ఏళ్లుగా హెజ్‌బొల్లా మిమ్మల్ని మానవ కవచాలుగా ఉపయోగించుకుంటోంది. మీ ఇళ్లల్లో రాకెట్లు, క్షిపణులను దాచిపెడుతోంది. వీటితో మా నగరాలపై, మా పౌరులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడుతోంది. మా ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం కోసం హెజ్‌బొల్లాపై దాడులు చేయడం తప్పట్లేదు. మీ ఇళ్లల్లో దాచిన ఆయుధాలను నిర్వీర్యం చేయడం తప్పనిసరి. హెజ్‌బొల్లా కారణంగా మీ జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసుకోవద్దు. లెబనాన్‌ను నాశనం చేయనివ్వద్దు. ఈ హానికర పరిస్థితి నుంచి ఇప్పుడే బయటపడండి. మా హెచ్చరికలను తీవ్రంగా తీసుకోండి. మా ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు సురక్షితంగా మీ ఇళ్లకు తిరిగి రావచ్చు’’ అని నెతన్యాహు హెచ్చరించారు.
దీన్ని బట్టి చూస్తుంటే లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ఆగేలా కన్పించట్లేదు. హెజ్‌బొల్లా ఆయుధాలను దాచిన బెకా లోయనూ ధ్వంసం చేస్తామని ఇప్పటికే ఐడీఎఫ్ ప్రకటించింది. లోయలోని పౌరులు ఆయుధాలు దాచిన నివాసాలను వదిలి తక్షణం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తెలిపారు.
492కు చేరిన మరణాలు
ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 492 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 90మందికిపైగా మహిళలు, చిన్నారులే. మరో 1600 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్‌పై ఈ స్థాయిలో భీకర దాడి జరగడం 2006 నాటి ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం.
గతేడాది అక్టోబరులో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచే హెజ్‌బొల్లా అందులో జోక్యం చేసుకుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పైకి దాదాపు 9వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఒక్క సోమవారమే 250కి పైగా రాకెట్లతో దాడి చేయగా, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాటిని ధ్వంసం చేసింది.
లెబనాన్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ - 492 మంది మృతి, 1645 మందికి గాయాలు - Israel Attack On Lebanon