తెలంగాణ

telangana

ETV Bharat / international

'CAA మా వ్యవహారం, మీ జోక్యం అవసరం లేదు!'- అమెరికాకు భారత్​ స్ట్రాంగ్​ కౌంటర్​

India Strong Counter To USA On CAA : ముస్లిమేతర మైనార్టీలకు సత్వరం పౌరసత్వం ఇచ్చేందుకు భారత్‌ జారీచేసిన సీఏఏ నోటిఫికేషన్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తప్పుబట్టింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పింది. ఈ వ్యవహరంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు హితవు పలికింది.

USA On CAA India Strong Counter
USA On CAA India Strong Counter

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 6:48 PM IST

Updated : Mar 15, 2024, 7:21 PM IST

CAA India Strong Counter To USA :పౌరసత్వ సవరణ చట్టంపై అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది. సీఏఏ పూర్తిగా తమ అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవహరంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు సూచించింది. మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌ ఆందోళనకు గురి చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అన్నారు. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నామని, మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాలను సమానంగా చూడటమే ప్రజాస్వామ్య మూల సూత్రమని మిల్లర్‌ అన్నారు.

'ఇది దేశ అంతర్గత వ్యవహారం'
ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌, ఇది పూర్తిగా దేశ అంతర్గత వ్యవహారమని జవాబిచ్చారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లలో హింసకు గురై 2014కు ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు సీఏఏ చట్టం రక్షగా ఉంటుందని జైస్వాల్ స్పష్టం చేశారు. 'సీఏఏ వల్ల కొత్తగా పౌరసత్వం లభిస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం పోదు' అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ అమెరికాకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

'మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు'
'సీఏఏ వల్ల కొత్తగా పౌరసత్వం లభిస్తుందే తప్ప ఎవరి పౌరసత్వం పోదు. తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను సీఏఏ పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది. ఆ చట్టం ఒక దేశ అంతర్గత వ్యవహారం. భారత దేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు సురక్షిత ప్రదేశాన్ని అందిస్తుంది. దీనిపై అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు కల్పితం, అనవసరం. భారత్‌ బహుళ సంస్కృతులు, విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా శ్రేయాభిలాషులు, భాగస్వాములు సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించాలి' అని భారత విదేశాంగ రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ఇదీ సీఏఏ
2014 డిసెంబర్‌ 31వ తేదీరి ముందు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం భారత పౌరసత్వం ఇచ్చేందుకు 2019లో కేంద్రం ఈ సీఏఏ చట్టాన్ని తీసుకువచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఏఏ విధి విధానాలు పేర్కొంటూ ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందుకు సంబంధించిన వెబ్​సైట్​ను కూడా ప్రారంభించింది.

రష్యాలో తొలిసారి 3రోజుల ఎన్నికలు- పుతిన్​దే మళ్లీ పీఠమా?

'పౌరసత్వ సవరణ చట్టం ఆందోళన కలిగిస్తోంది'- CAAపై అమెరికా కీలక వ్యాఖ్యలు

Last Updated : Mar 15, 2024, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details