US presidential Poll Begins : పోలింగ్ తేదీకి ఇంకా సమయం ఉండగానే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా ప్రజలు ముందస్తు ఓటింగ్ రూపంలో లిఖించటం మొదలెట్టారు.
అమెరికా అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో ముందస్తు, గైర్హాజరీ ఓటింగ్ వెసులుబాటు ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది తప్పనిసరి కూడా. అయితే, ఈ ముందస్తు ఎన్నికల్లోనూ రెండు పద్ధతులున్నాయి. ముందుగానే నిర్దేశించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తామే స్వయంగా ఓటు వేయటం. రెండోది పోస్ట్ ద్వారా తమ ఓటు పంపించటం. ఇలా పోస్టులో వచ్చిన ఓట్లను ముందుగానే తెరచి కొన్ని రాష్ట్రాల్లోని ఎన్నికల అధికారులు వాటిని పరిశీలిస్తారు.
ఇక గైర్హాజరీ (పోస్టల్) బ్యాలెట్ ఓట్లకు ఈనెల 11 నుంచే ప్రారంభమైంది. అందుకు అలబామా శ్రీకారం చుట్టగా, 19న విస్కాన్సిన్, 20న మినెసోటా ఆరంభించాయి. టెక్సాస్‌లో అక్టోబరు 21న ముందస్తు ఓటింగ్ మొదలవుతుంది. అయితే, భారత్‌లో మాదిరిగా అమెరికాలో ఎన్నికల నిబంధనలు దేశమంతా ఒకేలా ఉండవు. ఒక్కోరాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అందుకే ఈ ముందస్తు ఎన్నికల వెసులుబాటు కొన్ని రాష్ట్రాల్లో ఉంటే మరికొన్నింట ఉండేది కాదు. కానీ ఈసారి ఎన్నికలకు 47 రాష్ట్రాలు ముందస్తు ఓటింగ్‌కు వెసులుబాటు కల్పించాయి. మేరీలాండ్, ఫ్లోరిడా, మసాచుసెట్స్, కనెక్టికట్‌లాంటివి తాజాగా పచ్చజెండా ఊపాయి. న్యూయార్క్ 2019లో ముందస్తు ఓటింగ్‌ను తప్పనిసరి చేసింది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా
ఈ ఓటింగ్ గడువు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరుగా ఉంది. కొన్ని రాష్ట్రాలు 50 రోజుల పాటు అనుమతిస్తున్నాయి. మరికొన్ని నవంబరు 5కు వారం రోజుల ముందు మాత్రమే వెసులుబాటు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వాషింగ్టన్ డీసీ సహా 23 రాష్ట్రాలు కేవలం శని, ఆదివారాల్లోనే ముందస్తు ఓటింగ్ ఏర్పాట్లు చేశాయి. అలబామా, మిసిసిపి, న్యూ హాంప్‌షైర్‌ల్లో ముందస్తు ఓటింగ్ లేదు. కొన్ని ప్రత్యేక కారణాల్లో మాత్రం గైర్హాజరీ బ్యాలెట్‌కు అంగీకరిస్తారు. 2020లో ముందస్తు ఎన్నికలను రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకించింది. కానీ, 2022 మధ్యంతర ఎన్నికల్లో (సెనెట్) మద్దతిచ్చింది.
ట్రంప్ vs హారిస్- ఎవరికీ స్పష్టమైన అధిక్యం లేదు!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు అకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఇద్దరు ప్రధాన అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ లేదు. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.