Imran Khan Jail Sentenced : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ పాకిస్థాన్ కోర్టు తీర్పునిచ్చింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసు ( సైఫర్ కేసు)లో ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్షను విధించిన మరుసటి రోజే పాకిస్థాన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.
కేసు ఏంటంటే?
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఇక వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రోలెక్స్ గడియారాన్ని ఇమ్రాన్ కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. రూ.15 లక్షలు విలువ చేసే మరో రోలెక్స్ గడియారాన్ని రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి, పలు కానుకలను ఇంటికి చేర్చుకున్న ఇమ్రాన్ రూ.8 లక్షల కానుకలను ఒక్క రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకున్నారని, ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. గ్రాఫ్ చేతి గడియారం, కఫ్లింక్స్, ఖరీదైన పెన్, ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచ్‌లు సహా మరికొన్ని కానుకల్ని మొత్తం రూ.2కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో తెలిపారు ఇమ్రాన్. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ఆదాయం వివరాల్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో చూపలేదు. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్‌పై ఈసీ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తర్వాత కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ కోర్టు ఏకంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది.