Houthis Missile Attack On Ship : గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో మార్లిన్ లాండ నౌకలోని కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది వెంటనే మంటలను అదుపుచేసేందుకు చర్యలు చేపట్టారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని నౌక ఆపరేటర్ ట్రాఫిగురా పేర్కొంది.
ఈ ఘటన సౌత్ ఈస్ట్ ఎడెన్‌కు 60 నాటికల్ మైళ్ల దూరంలో జరిగింది. దాడి జరిగిన వెంటనే యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. అలానే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, ఈమార్గంలో వెళుతున్న నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఒక క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది.
అమెరికా గస్తీ నౌకపై దాడి
మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో గస్తీ తిరుగుతున్న అమెరికా యుద్ధనౌక ఈఎస్ఎస్ కార్నే పై హౌతీ తిరుగుబాటుదారులు శుక్రవారం క్షిపణిని ప్రయోగించారు. దీన్ని తమ దళాలు కూల్చివేశాయని అమెరికా మిలిటరీ ఓ ప్రకటనతో తెలిపింది. అయితే ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై హౌతీ దాడులకు దిగినప్పటినుంచి, అమెరికా నౌకను డైరెక్ట్‌గా టార్గెట్ చేయడం ఇదే తొలిసారి.