Houthis Attack On US Ship :గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో వాణిజ్య నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వాణిజ్య నౌకపై హౌతీ రెబెల్స్ మూడు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌక లక్ష్యంగా మూడు క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. అందులో ఒక క్షిపణి సముద్రంలో పడిపోగా, మరో రెండు క్షిపణులను అమెరికాకు చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS గ్రేవ్లీ సమర్థవంతంగా నేలకూల్చింది. వాణిజ్య నౌకకు ఎలాంటి నష్టం కలగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
మరోవైపు, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, బాబ్ అల్-మందాబ్ జలసంధిలో తాము పలు అమెరికా యుద్ధ నౌకలతో పోరాడినట్లు హౌతీ గ్రూప్ ప్రకటించింది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా, తమ దేశంపై అమెరికా-బ్రిటన్ దాడికి ప్రతీకారంగా తాము ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపింది. తాము ప్రయోగించిన క్షిపణులు అమెరికా యుద్ధనౌకను నేరుగా తాకాయని, అమెరికాకు చెందిన రెండు వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రంలోకి ప్రవేశించకుండా వెనుదిరిగాయని హౌతీ గ్రూప్ ప్రకటించింది.