Naim Kassem First Speech :ఇజ్రాయెల్‌పై పోరు విషయంలో నస్రల్లా రూపొందించిన యుద్ధ వ్యూహానికి కట్టుబడి ఉంటామని హెజ్‌బొల్లా కొత్త చీఫ్ షేక్ నయీం ఖాసం స్పష్టం చేశారు. హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన తొలి ప్రసంగం చేశారు. "ఇజ్రాయెల్ దురాక్రమ ఆపాలని నిర్ణయించుకుంటే, అందుకు మాకు అంగీకారమే. అయితే మాకు ఆమోదయోగ్యమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మాకై మేముగా కాల్పుల విరమణ కోసం అడుక్కోము. ఎంత కాలమైనా పోరాటం చేస్తూనే ఉంటాం" అని ఆయన పేర్కొన్నారు.
హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లాను ఇటీవల ఐడీఎఫ్ అంతమొందించిన సంగతి తెలిసిందే. అతడి మరణం తర్వాత హెజ్‌బొల్లా కొత్త అధిపతి ఎవరన్న దానిపై తీవ్ర చర్చ జరిగింది. అనేక మంది పేర్లు వెలుగులోకి రాగా చివరకు ఖాసింను ఎన్నుకొన్నారు. తాజాగా ఆ స్థానంలోకి వచ్చిన నయీం ఖాసిం మాట్లాడుతూ, ‘‘ఇజ్రాయెల్ పోరు విషయంలో నస్రల్లా యుద్ధతంత్రానికి కట్టుబడి ఉంటా’’ అని వెల్లడించారు.
ఎవరీ నయీం ఖాసిమ్?
హెజ్‌బొల్లాలో నయీం ఖాసిమ్‌కు మంచి వ్యూహకర్తగా పేరుంది. నస్రల్లా మరణం తర్వాత ఆయన బంధువు సఫీద్దీన్‌కు పగ్గాలు అప్పగించే అవకాశమున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ సీనియారిటీ పరంగా నెయీమ్ ఖాసిమ్ ముందు వరుసలో ఉండడం వల్ల ఆయనకు హెజ్‌బొల్లా పగ్గాలు అందించారు.
వాస్తవానికి నస్రాల్లా హత్య తర్వాత, యుద్ధ పరిష్కారం దిశగా నెయీమ్ ఖాసిమ్ తొలిసారిగా మాట్లాడారు. ఓ వైపు హెజ్‌బొల్లా చీఫ్ మరణంతో యుద్ధం ముగియలేదని హెచ్చరిస్తూనే, కాల్పుల విరమణే ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని కూడా ఆయన చెప్పారు. అక్టోబరు 15న ఆయన ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరు: ఇజ్రాయెల్ హెచ్చరిక
ఇదిలా ఉండగా, నూతన చీఫ్‌గా ఖాసింను నియమించినట్లు హెజ్‌బొల్లా ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇది తాత్కాలిక నియామకమేనని, కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని పరోక్షంగా హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణమంత్రి చేసిన ఈ పోస్టు సంచలనంగా మారింది.