Hamas Tunnels Destroyed By IDF :హమాస్ మిలిటెంట్ల నిర్మూలనే లక్ష్యంగా వరుస బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ వారి ఆయుపట్టుపై గట్టిదెబ్బ కొడుతోంది. గాజా పట్టీలో ఇజ్రాయెల్ దళాలు మరో భారీ సొరంగాన్ని గుర్తించాయి. దాదాపు 10 కిలోమీటర్ల పొడవు ఉన్న భారీ సొరంగం దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్ విడుదల చేసింది. అది ఉత్తర, దక్షిణ గాజాను కలుపుతుందని తెలిపింది. ఉత్తర గాజాలోని టర్కిష్ ఆస్పత్రి కింద నుంచి దక్షిణ గాజాలోని ఇస్రా వర్సిటీ వరకు సొరంగం విస్తరించి ఉన్నట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి.
సొరంగంలో సకల సదుపాయాలు!
ఇజ్రాయెల్ దళాలు గుర్తించిన భారీ సొరంగంలో అన్ని సదుపాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. హమాస్ మిలిటెంట్లు నిద్రపోవడానికి పడకలు, విద్యుత్ సదుపాయం, నీరు, మరుగుదొడ్లు సహా ఇతర సదుపాయాలున్నాయి. లోపల ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచుకోవడానికి హమాస్ తగిన ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇజ్రాయెల్ దళాలు చెప్పాయి. సొరంగంలో తనిఖీల సందర్భంగా కొన్ని మృతదేహాలను గుర్తించినట్టు తెలిపాయి. ఈ సొరంగాన్ని బాంబులతో పేల్చి వేసినట్లు పేర్కొన్నాయి. తమ సభ్యులు, ఆయుధాల తరలింపు కోసం హమాస్ ఈ సొరంగాన్ని వినియోగిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇజ్రాయెల్ దళాల రివెంజ్
మరోవైపు, లెబనాన్‌లోని ఈశాన్య నగరమైన బాల్బెక్ సమీపంలో వైమానిక దాడులతో సోమవారం ఇజ్రాయెల్ విరుచుకుపడింది. హెజ్‌బొల్లా తమ డ్రోన్‌ను కూల్చివేయడం వల్ల ప్రతీకారంగా లెబనాన్‌లోని సుదూర ప్రాంతానికి వెళ్లి ఈ దాడులు చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. బాల్బెక్‌కు సమీపంలోని బుదే గ్రామంలో లారీల కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ మూడు వైమానిక దాడులు చేసిందని లెబనాన్ భద్రతాధికారులు తెలిపారు.
ప్రణాళిక సిద్ధం!
అంతకుముందు ఇజ్రాయెల్ డ్రోన్‌ను తమ ఫైటర్లు కూల్చి వేశారని హెజ్‌బొల్లా ప్రకటించింది. లెబనాన్, సిరియా సరిహద్దులోని బ్లిదా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన వేర్వేరు వైమానిక దాడుల్లో ఐదుగురు హెజ్‌బొల్లా మిలిటెంట్లు మృతి చెందారు. గాజాలోని రఫాలో భూతల పోరుకు సంబంధించిన ప్రణాళికను సైన్యం అందజేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ప్రస్తుతం రఫాలో 14 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఇబ్బంది కలగకుండా పోరు ఎలా సాగించాలనేది కేబినెట్‌లో చర్చించామని నెతన్యాహు వెల్లడించారు.