H 1B Visa New Guidelines : ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అమెరికా. దీని ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(USCIS) నూతన నిబంధనలను విడుదల చేసింది.
ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు రెండు నెలల గ్రేస్ పిరియడ్ ఉంది. కొత్త నిబంధనావళి ప్రకారం లేఆఫ్‌కు గురైన వారు గ్రేస్ పిరియడ్ సమయంలో నాన్ ఇమ్మిగ్రంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఏడాది పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) పొందేలా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని మార్పులు చేస్తూ యూఎస్సీఐఎస్ నిబంధనలు విడుదల చేసింది. తమ తాజా చర్యతో హెచ్-1బీ వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బంది లేకుండా పొందొచ్చని యూఎస్సీఐఎస్ పేర్కొంది.
ఇటీవల గూగుల్, టెస్లా, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. వీరిలో చాలా మంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నారు. అయితే ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు కేవలం 60 రోజులు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ లోపే మరో ఉద్యోగం వస్తే అక్కడే ఉండొచ్చు లేకపోతే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే. అయితే ఇంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం చూసుకోవడం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే ఉద్యోగులు మరింత కాలం అక్కడే ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ యూఎస్సీఐఎస్ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.