తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూ ఆర్లీన్స్ దాడి వెనుక ఉన్నది ఒక్కడే - ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రేరణతోనే ఎటాక్! - NEW ORLEANS RAMPAGE

న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ శక్తుల కుట్ర ఉందా?

New Orleans rampage
New Orleans rampage (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 9:18 AM IST

New Orleans Rampage :అమెరికా, న్యూ ఆర్లీన్స్ -​ న్యూ ఇయర్ వేడుకల్లో ప్రజలపైకి పికప్ ట్రక్కును నడిపి, 15 మందిని బలిగొన్న ఘటనపై ఎఫ్​బీఐ కీలక వివరాలు వెల్లడించింది. యూఎస్​ సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డాడని, అతను ఇస్లామిక్ స్టేట్​ గ్రూప్​ ప్రేరణతోనే ఈ ఘోరానికి పాల్పడినట్లు పేర్కొంది.

"టెక్సాస్​కు చెందిన యూఎస్ పౌరుడు షంసుద్దీన్ జబ్బార్​, దాడికి ముందు తన ఫేస్​బుక్​ ఖాతాలో 5 వీడియోలను పోస్ట్ చేశాడు. అందులో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు తన మద్దతు తెలిపాడు. అంతేకాదు తను చేయనున్న దాడుల గురించి ఈ కూడా ఆ వీడియోలో తెలిపాడు. ఇది కచ్చితంగా ముందస్తు ప్రణాళికతో చేసిన ఉగ్రవాద చర్య. జబ్బార్ నూటికి నూరుశాతం ఇస్లామిక్ స్టేట్ నుంచి ప్రేరణ పొంది ఈ దుష్ట చర్యకు పాల్పడ్డాడు. "
- క్రిస్టోఫర్​ రైయా, ఎఫ్​బీఐ, ఉగ్రవాద నిరోధక విభాగం డిప్యూటీ అసిస్టెంట్​ డైరెక్టర్​

విదేశీ కుట్ర ఉందా?
గురువారం మధ్యాహ్నం క్యాంప్​ డేవిడ్​ నుంచి తిరిగి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ, 'దాడికి పాల్పడింది ఒక్కడే అని, అతను ఉగ్రవాద సంస్థ ప్రేరణతోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. అయితే ఈ దాడి వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందా? లేదా? అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది' అని తెలిపారు.

14 మంది మృతి
బుధవారం న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే స్థానిక పోలీసులు జరిగిన కాల్పుల్లో దుండగుడు జబ్బార్ (42) కూడా మరణించాడు.

ఇంతలోనే లాస్ వెగాస్‌లో మరో పేలుడు చోటుచేసుకుంది. అది కూడా అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వెలుపల ఉన్న టెస్లా కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మరోవైపు న్యూయార్క్‌లోని క్వీన్స్‌ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో 11 మంది గాయపడ్డారు. ఈ వరుస ఘటనలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details