India US Bilateral Talks : అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన రెండో హయాంలో భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. న్యూదిల్లీకి ప్రాధాన్యతనిస్తూ వాషింగ్టన్ భేటీని ఏర్పాటు చేసింది. రూబియోతోపాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌తో కూడా జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా చర్చలు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారత్ తరఫున హాజరైన జైశంకర్, ఆ సందర్భంగా మార్కో రూబియోతో ఆయన భేటీ అయ్యారు. అగ్రరాజ్య విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యతలు స్వీకరించిన గంటలోపే ఈ సమావేశం జరగడం గమనార్హం. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ భేటీ అయ్యారు. భారత్ - అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా పలు అంశాలపై వీరు చర్చలు జరిపారు. సమావేశం తర్వాత వీరిద్దరూ మీడియాకు ఫొటోలిచ్చారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా సోమవారం డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్ దిగ్గజాలు హాజరయ్యారు. 1861లో అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉపయోగించిన బైబిల్, తన బైబిల్‌ను చేతిలో పట్టుకొని ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ వేడుకకు భారత్ తరఫున జైశంకర్ హాజరయ్యారు.
ట్రంప్ ప్రమాణస్వీకారానికి టీవీ వీక్షణలు తక్కువే
అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని టెలివిజన్‌లో 24.6 మిలియన్ మంది వీక్షించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రంప్ తొలి సారితో పోలిస్తే ప్రస్తుతం వ్యూస్ తగ్గినట్టు సమాచారం. 2017లో ప్రమాణస్వీకారానికి 30.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2021లో అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారాన్ని 33.8 మిలియన్ల మంది వీక్షించారు. నాటితో పోలిస్తే ప్రస్తుతం వ్యూస్ తగ్గినట్లు నీల్సన్ అనే సంస్థ వెల్లడించింది.