PM Modi Meet Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు.
ఓవల్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండోసారి వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్‌నకు 140కోట్ల మంది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. ట్రంప్ అనే పేరు, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని మోదీ వివరించారు. అలాగే 140కోట్ల మంది భారతీయులకు కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందని మోదీ తెలిపారు. ట్రంప్ హయాంలో ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ అహ్మదాబాద్, హ్యూస్టన్‌లలో నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీ-మోడీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లు కలిస్తే ఒకటి ఒకటి పదకొండు అవుతుందని అని మోదీ చెప్పారు.
"అమెరికా ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్యం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. రెండు కలిసి వచ్చినప్పుడు 1+1 = 2 కాదు. 11ని చేయగలం. ఇది మానవాళి సంక్షేమం కోసం పనిచేసే శక్తి. నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరుదేశాల పురోగతి, శ్రేయస్సు కోసం మనం కలిసి ముందుకు సాగాలని కలిసి సంకల్పించాం."
--నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్ పాత్రపై మాట్లాడిన ట్రంప్- తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత్-అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్-అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని చెప్పారు.
అంతకుముందు ప్రధాని మోదీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న స్పేస్‌ఎక్స్ సీఈవో, అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) అధినేత ఎలాన్ మస్క్ వాషింగ్టన్‌లో మోదీతో సమావేశయ్యారు. మోదీ బస చేసిన ప్రఖ్యాత బ్లేయర్‌హౌస్‌కు ఆయన గురువారం తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రధానితో సమావేశంలో ఆత్మీయంగా మాట్లాడారు. అంతరిక్షం, సాంకేతికత, నవకల్పనలు సహా పలు అంశాలపై మస్క్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలియజేశారు. 'కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన' కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొస్తున్న సంస్కరణలను ఆయనకు వివరించినట్లు చెప్పారు.
మరోవైపు- అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) మైఖేల్ వాల్జ్ కూడా మోదీతో సమావేశమయ్యారు. సంబంధిత వివరాలను ప్రధాని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రతా రంగాలు చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. వాటిపై వాల్జ్‌తో చర్చలు ఫలప్రదంగా సాగాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, అంతరిక్షం తదితర రంగాల్లో ఇరు దేశాలూ పరస్పర సహకారం పెంచుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. వాల్జ్‌ను భారత్‌కు గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ఈ భేటీల్లో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా మోదీతో సమావేశమయ్యారు.