Elon Musk Vivek Ramaswamy US Politics : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. "ఈ అద్భుతమైన ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నిబంధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా-2 ఉద్యమానికి ఇవి ఎంతో ముఖ్యమైనవి. వీరిద్దరూ నా పాలనకు మార్గం సుగమం చేస్తారు" అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మస్క్, వివేక్ రామస్వామికి ట్రంప్ కీలక బాధ్యతలు- 'సేవ్ అమెరికా 2 ఉద్యమానికి ఎంతో ముఖ్యం!'
ట్రంప్ కార్యవర్గంలో మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు
Published : Nov 13, 2024, 8:45 AM IST
|Updated : Nov 13, 2024, 9:00 AM IST
ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా రాట్‌క్లిఫ్
మరోవైపు, నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్లలందరి రాజ్యాంగ హక్కుల కోసం నిర్భయమైన పోరాట యోధుడిగా రాట్‌క్లిఫ్ నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అర్కాస్నాస్ మాజీ గవర్నర్ మైక్ హుక్‌అబీని ఇజ్రాయెల్ రాయబారిగా ఎంపిక చేశారు. రక్షణశాఖ కార్యదర్శి బాధ్యతలను ఫ్యాక్స్ న్యూస్‌లో హోస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న పీట్ హెగ్సెత్‌కు అప్పగించారు.
జాతీయ భద్రత సలహాదారుడిగా మైక్ వాల్ట్‌జ్
అమెరికా జాతీయ భద్రత తదుపరి సలహాదారుగా ఫ్లోరిడా కాంగ్రెస్ సభ్యుడు, ఇండియా కాకాస్ సహాధ్యక్షులు మైక్ వాల్ట్‌జ్ నియమితులయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత త్వరలో అధ్యక్ష పదవిని చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా జాతీయ భద్రత సలహాదారుగా మైక్ వాల్ట్‌జ్‌ను నియమించారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న జేక్ సలీవాన్ స్థానంలో వాల్ట్‌జ్ నియమితులు కానున్నారు. చైనా వ్యతిరేకిగా ముద్రపడిన వాల్ట్‌జ్ ఆసియా-పసిఫిక్‌ప్రాంతంలో డ్రాగన్ దుందుడుకు చర్యలను పలుమార్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వాల్ట్‌జ్ నియామకం భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇండియా కాకాస్ సహాధ్యక్షులు, డెమొక్రటిక్ సభ్యుడు రోఖన్నా అభిప్రాయపడ్డారు.