Donald Trump Costly Gifts: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఓ ఆన్‌లైన్ స్ట్రీమర్ ఇచ్చిన ఖరీదైన గిఫ్టులు చర్చనీయాంశంగా మారాయి. సోమవారం ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో అడిన్ రోస్ అనే ప్రముఖ స్ట్రీమర్‌తో కలిసి లైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను ట్రంప్‌నకు బంగారంతో చేసిన రోలెక్స్ వాచ్‌ను, ప్రత్యేకంగా తయారుచేయించిన టెస్లా సైబర్ ట్రక్‌ను బహూకరించారు. ఈ సైబర్ ట్రక్‌పై ట్రంప్ దాడి తర్వాత తీసిన ఫొటో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ రాయించారు. దీనిపై ట్రంప్ కూడా సంతోషం వ్యక్తంచేశారు. అద్భుతమైన బహుమతిగా దీనిని అభివర్ణించారు. దీంతోపాటు ఓ కస్టమ్ ప్లేలిస్ట్‌ను కూడా అందించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ఆ గిఫ్ట్‌లను చూసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రచార ఉల్లంఘన?
టెస్లా వెబ్‌సైట్ ప్రకారం, బేస్ మోడల్ సైబర్ ట్రక్ ఖరీదు 60,990 డాలర్లు. దీనికి హైఎండ్ హంగులు సమకూరిస్తే దాని ధర 1,00,000 డాలర్లకు చేరుతుంది. దీనిపై అంటించిన స్టిక్కర్ ధర 4,000 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇక రోలెక్స్ వాచ్ ధర 5,000 డాలర్లు. వాస్తవానికి ప్రతీ ఎలక్షన్ ప్రచార విడతలో ఫెడరల్ క్యాంపెయిన్ కాంట్రిబ్యూషన్ పరిమితి కేవలం 3,300 డాలర్లు మాత్రమే. దీంతో ట్రంప్‌నకు న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు అంటున్నారు. మరోవైపు డాక్యుమెంటెడ్ అనే పరిశీలన సంస్థకు చెందిన నిపుణుడు బ్రెండెన్ ఫిషర్ మాట్లాడుతూ ఇవి చట్ట విరుద్ధం కావచ్చని పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ ప్రచార బృందానికి చెందిన కారోలిన్ లెవిట్ మాట్లాడుతూ ఈ గిఫ్ట్‌లు ఏం చేయాలనే అంశంపై ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను కోరతామని పేర్కొన్నారు.