Democratic Party Nominee Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో భారత సంతతి మహిళ కమలా హారిస్ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె పేరు అధికారికంగా ఖరారైంది. డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో భాగంగా అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం గత ఐదురోజులుగా ఆన్‌లైన్‌లో ఓట్లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం డెమొక్రటిక్ పార్టీ క్యాడర్ వేసిన ఓట్లలో దాదాపు 99 శాతం ఓట్లు కమలా హారిస్‌కే అనుకూలంగా వచ్చాయి. దీంతో ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది కమలే అని తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్లజాతి వనితగా ఆమె ఘనతను సాధించారు. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ వ్యవహరిస్తున్నారు.
పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో కీలక ప్రకటన
వాస్తవానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే జూన్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన లైవ్ డిబేట్‌లో బైడెన్ తడబడ్డారు. ట్రంప్‌నకు ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో బైడెన్‌కు ప్రజా మద్దతు గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. కమలా హారిస్‌కు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈక్రమంలోనే డెమొక్రటిక్ పార్టీ క్యాడర్ నుంచి కమలకు స్పష్టమైన మద్దతు లభించింది. ఆ పార్టీలోని కీలకమైన 1,976 మంది ప్రతినిధులు ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో కమల అధ్యక్ష అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయింది. ఈనెల 19 నుంచి 22 వరకు షికాగో వేదికగా డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఆ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు.