Columbia University Protest:అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయంలో నిరసనలు అదుపులోకి వచ్చాయి. గాజా- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చటం వల్ల పోలీసులు రంగంలోకి దిగారు. 12 గంటలుగా హామిల్టన్ హాల్‌లో బైఠాయించిన నిరసనకారులను మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) అదుపులోకి తీసుకున్నారు.
ఉద్రిక్తంగా క్యాంపస్!
అంతకుముందు వర్సిటీ యాజమాన్యం నిరసనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మరో మార్గంలో తమ ఆందోళనలను తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది. కానీ, పాలస్తీనా మద్దతుదారులు యాజమాన్యం విజ్ఞప్తిని పెడచెవిన పెట్టటం వల్ల చేసేదిలేక పోలీసులను పిలిపించింది. చర్యలు తీసుకునేందుకు వారికి అనుమతించింది. దీంతో నిరసనలు, పోలీసుల అరెస్టులతో క్యాంపస్ కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. కొన్ని రోజుల క్రితం కొలంబియా వర్సిటీలో ప్రారంభమైన ఈ నిరసనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి.
మిలియన్ డాలర్ల నష్టం!
దీంతో ఆయా యూనివర్సిటీల్లోని పాలస్తీనా మద్దతుదారులు ఆందోళనలు దిగారు. ఈ క్రమంలో పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,000 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిరసనల్లో భాగంగా కొంతమంది అకాడమిక్ బిల్డింగ్‌లను ఆక్రమించారు. దీన్ని శ్వేతసౌధం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది శాంతియుత ప్రదర్శన కాదని తెలిపింది. ఇప్పటి వరకు నార్తర్న్ కాలిఫోర్నియా క్యాంపస్‌లో మిలియన్ డాలర్ల నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
భారత సంతతకి చెందిన విద్యార్థిని అరెస్ట్
అయితే ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో చదువుతున్న భారత సంతతకి చెందిన విద్యార్థిని అచింత్య శివలింగన్‌ను నిరసనల్లో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నందుకుగాను ఆమెను యూనివర్సిటీ నుంచి నిషేధించారు. శివలింగన్‌తో పాటు మరో విద్యార్థి హసన్ సయ్యద్ కూడా ఆందోళనల్లో పాల్గొన్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. నిరసన నిలిపి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని పదే పదే హెచ్చరించినా వినకపోవడం వల్ల వారిని అరెస్టు చేసినట్లు యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన శివలింగన్ ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నారు.