Chinese Research Ship In Maldives :మాల్దీవులతో భారత్‌కు దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్-03 మాల్దీవుల జలాల్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. గ్లోబల్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, చైనా పరిశోధన నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ మాల్దీవులకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక రాకపై భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందూ మహాసముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం ఈ నౌక వల్ల చైనాకు లభిస్తుందని పేర్కొన్నాయి. దీని వల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించాయి.
షియాంగ్ యాంగ్ హాంగ్-03 నౌక చైనాలోని థర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందింది. సముద్ర గర్భంలోని పరిస్థితులు, ఖనిజాన్వేషణ, ఇతర అంశాలపై పరిశోధనలు జరపడమే దీని ముఖ్య ఉద్దేశమని చైనా చెబుతోంది. జనవరిలో చైనాలోని సన్యా నుంచి బయలుదేరిన ఈ పరిశోధక నౌక తర్వలో మాల్దీవుల రాజధాని మాలె తీరానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ నౌక మరికొన్ని రోజుల్లో తమ జలాల్లోకి ప్రవేశించినుందని చెప్పిన మాల్దీవులు ఎలాంటి పరిశోధనలు నిర్వహించదని తెలిపింది. ఇప్పటికే శ్రీలంక వెళ్లిన ఈ తరహా నౌకలు వాటి కార్యకలాపాలను జలాల వరకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఆ సమయంలో మాల్దీవులు, శ్రీలంక మధ్యనున్న జలాల్లో కదలడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు హిందు మహాసముద్రంలో చైనా ప్రభావం విస్తరిస్తుండటం వల్ల పరిశోధక నౌక కదలికల్ని భారత్ నిశితంగా గమనిస్తోంది.