తెలంగాణ

telangana

ETV Bharat / international

వరుసగా మూడో ఏడాదీ చైనా జనాభా డౌన్​- ఫ్యూచర్​లో పెద్ద సవాలే! - CHINA POPULATION FALLS

మూడో ఏడాది కూడా చైనా జనాభా డౌన్- 2023తో పోలిస్తే 2024లో తగ్గిపోయిన 13.90 లక్షల జనాభా

China Population
China Population (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2025, 12:43 PM IST

China Population Falls :వరుసగా మూడో ఏడాది కూడా చైనా జనాభా తగ్గిపోయింది. 2024 సంవత్సరం చివరి నాటికి చైనాలో 140.8 కోట్ల జనాభా ఉంది. అంతక్రితం ఏడాది (2023)తో పోలిస్తే 13.90 లక్షల మేర జనాభా తగ్గిపోయింది. ఈ గణాంకాలను స్వయంగా చైనా ప్రభుత్వమే శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ఇది చైనాకు ప్రతికూల అంశమని ఆర్థిక రంగ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతోందని, పనులు చేయగలిగిన యువ జనాభా తగ్గుతోందని వారు గుర్తు చేస్తున్నారు.

"తమ దేశంలోకి విదేశీ వలసలను చైనా ప్రభుత్వం అంతగా ప్రోత్సహించదు. అందుకే దేశ జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో చైనా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనాభా తగ్గిపోతున్న జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తూర్పు ఐరోపా దేశాల జాబితాలో మూడేళ్ల క్రితమే చైనా చేరిపోయింది.

నజీవ వ్యయాలు పెరుగుతుండటం వల్ల!
చైనాలో ప్రజల జీవన వ్యయాలు బాగా పెరిగాయి. దీంతో చాలామంది యువత త్వరగా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సరైన ఆదాయాలు లేకపోవడంతో పెళ్లయిన వారు ఎక్కువ మంది పిల్లల్ని కనే సాహసం చేయడం లేదు. చైనాలోని వృద్ధుల సగటు ఆయుర్దాయం బాగా పెరిగింది. ఇక ఇదే సమయంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిది. వెరసి ఆ దేశ జనాభా తగ్గుదల మొదలైంది. చైనాలో ప్రతీ 104.34 మంది పురుషులకు, 100 మంది మహిళలే ఉన్నట్లు చైనా సర్కారు తాజా నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కల్లో వాస్తవికత లేదని మహిళ, పురుష జనాభాలో వ్యత్యాసం ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

చైనా జనాభాలో ఐదింట ఒకవంతు లేదా 22 శాతం మంది(31.30 కోట్లు) 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2035 నాటికి ఈ వయో వర్గంలోని వారి సంఖ్య జనాభాలో 30 శాతానికి మించుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో చైనాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పట్టణాలు, నగరాలకు వలస వెళ్లినట్లు నివేదికలో ప్రస్తావించారు. చైనాలో పట్టణీకరణ రేటు 67 శాతంగా ఉందన్నారు.

చైనా ఆర్థిక వృద్ధి 5.4 శాతం
2024 సంవత్సరం అక్టోబరు - డిసెంబరు త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.4 శాతం మేర వృద్ధిని సాధించిందని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని కంపెనీలకు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం, ఎగుమతులు జోరుగా జరిగినందుకు ఇది సాధ్యమైంది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే చైనా సరుకులపై పన్నులను పెంచుతారనే ఆందోళనల నేపథ్యంలో ఆ మూడు నెలల వ్యవధిలో భారీగా ఎగుమతులు జరిగాయి. అయితే చైనీయుల కొనుగోలు శక్తి ఇంకా బలహీనంగానే ఉందని అంటున్నారు. కరోనా సంక్షోభ కాలపు ప్రతికూల ఆర్థిక పరిణామాల ప్రభావం నేటికీ చైనా ప్రజలపై ఉందని చెబుతున్నారు.కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో చైనా ఆర్థిక వ్యవస్థల 5.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details