Sunita Williams Spacewalk : ఏడు నెలలుగా రోదసిలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ నిర్వహించారు. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి వచ్చినప్పటి నుంచి ఆమె వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. తాజాగా గురువారం చేసిన స్పేస్‌వాక్‌లో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు.
తుర్కెమెనిస్థాన్‌కు దాదాపు 400 కిలోమీటర్ల ఎగువన అంతరిక్ష కేంద్రం పయనిస్తున్నప్పుడు వీరిద్దరూ వెలుపలికి వచ్చారు. గతంలో ఐఎస్‌ఎస్‌లో విధులు నిర్వర్తించినప్పుడు కూడా సునీత స్పేస్‌వాక్ నిర్వహించారు. మొత్తం మీద ఈ విన్యాసాన్ని ఆమె చేపట్టడం ఇది ఎనిమిదోసారి. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్ గత ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్ చేరుకున్నారు. నిజానికి వారం రోజుల్లో వ్యోమగాములిద్దరూ ఈ వ్యోమనౌకలో తిరిగి భూమికి చేరుకోవాల్సింది.
అయితే, వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అక్కడే చిక్కుకుపోయారు. ఈ ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌లో భూమికి తిరుగుప్రయాణమయ్యే అవకాశం ఉందని సమాచారం. సునీతా విలియమ్స్ ప్రస్తుతం మూడో రోదసి యాత్రలో ఉన్నారు. గతంలో 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 2012 నాటికి ఏడు స్పేస్‌వాక్‌లు నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు.