Three Arrest In Alwal Incident : అన్న కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఓ యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారం పరిధిలో నివసించే నిందితుడు (37) తన సోదరుడి కుమార్తె (18)ను పెంచుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివసించే భవన నిర్మాణ కార్మికుడు ప్రకాశ్ కుమారుడు ప్రదీప్ ప్రేమిస్తుండటంతో 2 కుటుంబాల మధ్య కక్షలు పెరిగాయి.
తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు : ఈ క్రమంలో సంక్రాంతి పండుగ రోజున ప్రదీప్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిందితుడు పథకం వేసుకున్నాడు. ఇందుకు అతని స్నేహితులు ఎల్లేశ్, పవన్ కల్యాణ్‌లు సహకరించారు. సంక్రాంతి పండుగ రోజు రాత్రి అయినా ప్రదీప్ ఆచూకీ లభించలేదు. అప్పటికే ఆవేశంలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రదీప్ తల్లిదండ్రులు ప్రకాశ్, హేమలతపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు కాగా హేమలత ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
నిందితులకు రిమాండ్ : ఘటనా స్థలంలో ఆడుకుంటున్న పక్కింటి బాలిక చాందినికి మంటలు అంటుకొని గాయపడిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని గురువారం పట్టుకున్నారు. అతనికి సహకరించిన ఎల్లేశ్, పవన్ కల్యాణ్‌లను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.
విషమంగా బాధితుడి పరిస్థితి - చికిత్స పొందుతున్న బాలి క : 50 శాతానికి పైగా కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న ప్రదీప్ తండ్రి ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాలుగు సంవత్సరాల చాందిని కాలిన గాయాలతో విలవిల్లాడుతోంది. 2 కాళ్లు, పొత్తి కడుపు వద్ద గాయాలతో కొంపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్సకు భారీగా వ్యయం చేయాల్సి రావడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాలిక తండ్రి దిలీప్ వేడుకుంటున్నాడు.