China Cyber Attack On India :చైనా హ్యాకర్ల ముఠా భారత్ సహా పలు దేశాలు, సంస్థలపై సైబర్ దాడులకు పాల్పడినట్టు 'ది వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనంలో వెల్లడించడం కలకలం రేపుతోంది. చైనా ప్రభుత్వం మద్దతున్న హ్యాకింగ్ సంస్థ 'ఐసూన్'కు చెందిన పలు కీలక పత్రాలు ఇటీవల లీకయ్యాయనీ ఆ డాక్యుమెంట్లలో సంచలన విషయాలు బయటపడినట్లు ఆ కథనం వెల్లడించింది. విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేసుకుని చైనా హ్యాకర్లు భారీ సైబర్ దాడులకు పాల్పడినట్లు అందులో తేలిందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లోని లోపాలను ఉపయోగించుకుని డ్రాగన్ హ్యకర్లు ఈ దాడులు చేసినట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది.
మరో 19 దేశాలపైనా సైబర్ పంజా!
లీకైన పత్రాలు షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న 'ఐసూన్' అనే కంపెనీకి చెందినవని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత వారం అవి గిట్‌హబ్‌లో వెలుగుచూశాయనీ చైనా ప్రభుత్వ కంపెనీలు, మంత్రిత్వ శాఖలకు ఈ సంస్థ థర్డ్ పార్టీ హ్యాకింగ్ సేవలు అందిస్తోందని పేర్కొంది. సైబర్ దాడులు చేసి విదేశీ సమాచారాన్ని సేకరించేందుకు హ్యాకర్లతో చైనా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పత్రాల్లో ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. భారత్, యూకే, తైవాన్, మలేసియా సహా మొత్తం 20 దేశాల ప్రభుత్వాలను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు తేలిందని 'ది వాషింగ్టన్ పోస్ట్' తెలిపింది. ఈ పత్రాలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ప్రస్తుతం చైనా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.