Ceasefire Talks Israel Gaza :ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిగిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది. చర్చల అనంతరం హమాస్ ప్రతినిధులు ఖతార్ వెళ్లిపోయారని పేర్కొంది. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్టు సమాచారం. దీంతో చర్చలు విజయవంతం కాలేదని అనధికార వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో అతి త్వరలో భారీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
అల్-జజీరాపై ఇజ్రాయెల్ నిషేధం
మరోవైపు, హమాస్‌కు అనుకూలంగా పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానెల్‌పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు నేతృత్వంలో మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానానికి ఏప్రిల్ 1న ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అయితే తమపై విధించిన నిషేధాన్ని అల్-జజీరా ఖండించింది. అధి మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈ నిషేధ ఉత్తర్వులను సవాల్ చేస్తామని వెల్లడించింది. ఓవైపు కాల్పుల విరమణపై హమాస్-ఇజ్రాయెల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న కీలక సమయంలో ఈ నిర్ణయం వెలువడటం చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఈ చర్చల్లో అమెరికా, ఈజిప్టుతో పాటు ఖతార్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అల్-జజీరా ఛానల్ ఖతార్ ప్రభుత్వానికి చెందినది. మంత్రి మండలి తీర్మానంతో అల్-జజీరా ఛానల్ పరికరాలను ఇజ్రాయెల్ అధికారులు జప్తు చేయొచ్చు. ఇజ్రాయెల్‌లో టీవీ ప్రసారాలను నిలిపివేయొచ్చు. వెబ్‌సైట్లను కూడా బ్లాక్ చేయొచ్చు.