Canada PM Resign : ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ, ఇటీవల కాలంలో భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచీ వైదొలగనున్నట్లు తెలిపారు. తదుపరి నాయకుడిని తమ పార్టీ ఎంపికచేసే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితోపాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ, లీ బ్లాంక్‌లలో ఒకరు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 'కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నా' అని సోమవారం మీడియా సమావేశంలో ట్రూడో పేర్కొన్నారు. అంతేకాదు కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందని వెల్లడించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా - రేసులో భారత సంతతి నేతలు! - CANADA PM RESIGN
రసవత్తరంగా కెనడా పాలిటిక్స్ - ప్రధాని రేసులో మార్క్ కార్నీ, లీ బ్లాంక్ - భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ కూడా!
Published : Jan 6, 2025, 10:50 PM IST
|Updated : Jan 7, 2025, 7:18 AM IST
ట్రూడోపై ప్రజల్లో అసంతృప్తి
53 ఏళ్ల ట్రూడో పాలనపై కొంత కాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయంగానూ ఆయన తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడో ఇటీవలి కాలంలో దేశీయంగా, అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయ్యారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఎలాంటి నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్, ట్రూడో పాలనపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. డ్రగ్స్, అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే, ఆ దేశంపై 25 శాతం పన్ను విధిస్తామని హెచ్చరించారు. దీంతో జస్టిన్ ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్టియా ఫ్రీలాండ్ - ప్రధాని ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడోకు ఉన్న జనాదరణ భారీగా తగ్గిపోయింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీవైపు 47 శాతం ప్రజలు మొగ్గు చూపితే, కేవంల 21 శాతం మంది మాత్రమే లిబరల్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు.
రేసులో భారత సంతతి నేతలు
జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత, కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ఇద్దరు భారత సంతతి నేతల పేర్లూ వినిపిస్తున్నాయి. ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్‌తో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.