Canada Nijjar Death Case: ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిజ్జర్‌ను చంపడానికి భారత ప్రభుత్వం నియమించిన హిట్ స్క్వాడ్‌లో సభ్యులుగా అనుమానిస్తూ కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వారి ఫొటోలను పోలీసులు. అయితే వీరందరూ భారత సంతతికి చెందినవారని రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్సీఎమ్పీ) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆర్సీఎమ్పీ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ టెబౌల్, నిజ్జర్ హత్య దార్యాప్తు వేగంగా జరుగుతోందని వెల్లడించారు.
"నిజ్జర్ హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అభియోగాలు మోపారు. అయితే సాక్ష్యాధారాల స్వభావంపై మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. అలాగే నిజ్జర్ హత్య వెనుక ఉన్న ఉద్దేశం గురించి కూడా మాట్లాడలేం. ఈ విషయంలో దర్యాప్తు మాత్రం చాలా క్రియాశీలకంగా జరుగుతుందని చెప్పగలను. ఈ విషయాలపై ప్రత్యేక, విభిన్నమైన దర్యాప్తులు కొనసాగుతున్నాయి. అది ఈరోజు అరెస్టైన వ్యక్తుల ప్రమేయానికి మాత్రమే సంబంధించినది కాదు. భారత ప్రభుత్వ ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది" అని డేవిడ్ టెబౌల్ తెలిపారు.
అయితే నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం హస్తం ఉందా లేదా అనే విషయాన్ని కెనడా పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ డొమినిక్ లెబ్లాంక్ నిర్ధరించలేదు. కానీ అలాంటి విషయాల్లో దర్యాప్తును ఆర్సీఎంపీకి అప్పగించాలని చెప్పారు. "కెనడా ప్రభుత్వ భద్రతా యంత్రాంగం, RCMP, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ చేసే పనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ పోలీసుల చర్యను బట్టి చూస్తే, ఈ కేసును ఆర్సీఎంపీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది" అని డొమినిక్ అన్నారు.