తెలంగాణ

telangana

ETV Bharat / international

టారిఫ్ రివెంజ్​- అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచిన కెనడా, మెక్సికో! - CANADA US TARIFFS WAR

సుంకాలపై ట్రంప్‌ నిర్ణయం- కెనడా, మెక్సికో ప్రతీకార చర్యలు

Canada US Tariffs War
Canada US Tariffs War (AFP)

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2025, 12:13 PM IST

Canada US Tariffs War : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మొదలుపెట్టిన సుంకాల యుద్ధానికి గట్టి ప్రతిస్పందన ఎదురవుతోంది. ట్రంప్ కెనడా, మెక్సికో దిగుమతులుపై 25% సుంకం విధించే ఆర్డర్లపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కెనడా, మెక్సికోలు ప్రతీకార చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగా 155 బిలియన్‌ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25% సుంకం విధిస్తునట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది.

"155 బిలియన్ కెనడియన్‌ డాలర్ల అమెరికా దిగుమతులపై 25% టారిఫ్‌లు విధిస్తున్నాము. ట్రంప్‌ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన. ఇందులో 30 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం ఈ మంగళవారం నుంచే అమల్లోకి వస్తుంది. మిగిలినవి టారిఫ్‌లు 21 రోజుల తర్వాత అమలవుతాయి. అమెరికాను స్వర్ణయుగంలా మార్చాలని ట్రంప్‌ అనుకుంటే, మాతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలి. అదే వారికి మంచిది" అని జస్టిన్‌ ట్రూడో అన్నారు.

కెనడా బాటలోనే మెక్సికో
మెక్సికో కూడా కెనడా బాటలోనే నడుస్తోంది. తాము కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్‌ పేర్కొన్నారు. "డ్రగ్స్‌ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం 4 నెలల్లో 20 మిలియన్‌ డోస్‌ ఫెంటనిల్ సహా 40 టన్నులకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. దాదాపు పదివేల మందిని అరెస్ట్‌ చేశాం. మెక్సికో ఎల్లప్పుడూ పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదు. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే, అందుకు కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అధిక సుంకాలు విధిస్తే సమస్యలు పరిష్కారం కావు. మెక్సికన్‌ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్లాన్-బీని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నా" అని షేన్‌బామ్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

అమెరికా సంగతి అక్కడ చూసుకుంటాం: చైనా హెచ్చరిక
చైనాపై సుంకాలు విధించాలన్న ట్రంప్‌ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో అమెరికా నిర్ణయాన్ని సవాలు చేస్తామని ప్రకటించింది. కెనడా, మెక్సికోపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్‌ శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సుంకాలు ఈ మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చైనా పేర్కొంది.

"అమెరికా తప్పుడు పద్ధతులు అనుసరిస్తోంది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఈ సుంకాల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా, సాధారణ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని సహేతుక దృష్టితో అమెరికా చూడాలి. ఇతర దేశాలను టారిఫ్‌లతో ప్రతిసారి బెదిరించకుండా, తన దేశంలో ఫెంటనిల్‌ లాంటి సమస్యలను సొంతగా పరిష్కరించుకోవాలి. తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని యూఎస్‌ను కోరుతున్నాం" అని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాన ప్రచార అస్త్రాల్లో ఫెంటనిల్‌ అంశం ఒకటి. ఈ డ్రగ్‌ను తమ దేశంలోకి డంప్‌ చేస్తోందన్న ఒక్క కారణంతోనే చైనాపై 25% అదనపు సుంకాలను విధిస్తానని ఆనాడే ట్రంప్‌ హెచ్చరించారు. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి హెరాయిన్‌ కంటే 50 రెట్లు శక్తిమంతమైందని నిపుణులు అంటున్నారు. రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నట్లు తెలుస్తోంది.

2022 సంవత్సరంలో ఫెంటనిల్‌ అధికంగా తీసుకోవడం వల్ల 1,07,941 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా సీడీసీ పేర్కొంది. అంటే సగటున రోజుకు 295 మంది దీని కారణంగా చనిపోయారు. 2023లో ఈ మరణాల సంఖ్య 1,10,640 ఉండొచ్చని అంచనా వేస్తోంది. 2019లో కొందరు అమెరికా అధికారులు ఈ డ్రగ్‌ను సామూహిక విధ్వంసక ఆయుధంగా వర్గీకరించాలని కోరినట్లు న్యూయార్క్‌ పోస్టు కొన్ని నెలల కిందట ప్రచురించిన ఓ కథనంలో పేర్కొనడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details