US Military Aid To Ukraine :రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు మరోసారి భారీ సైనిక సహాయక ప్యాకేజీని అమెరికా ప్రకటించింది. రూ.4,293 కోట్లు విలువైన అదనపు సైనిక సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందించే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా భారీగా ఆయుధాలు, ఆయుధ పరికరాలను ఉక్రెయిన్‌కు అందించనున్నారు. ఈ వివరాలను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌ను స్వాహా చేసే అవకాశాన్ని పుతిన్‌కు ఇవ్వకూడదు. ఒకవేళ పుతిన్ చేతికి ఉక్రెయిన్ చిక్కితే, ఆయన ఆకలి మరింత పెరుగుతుంది. అదే జరిగితే రష్యా ఇరుగుపొరుగున ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థలు కూలుతాయి. అది జరగనివ్వం’’ అని ఆస్టిన్ పేర్కొన్నారు. ‘‘పుతిన్ లాంటి నిరంకుశ పాలకుల దూకుడుకు అవకాశం ఇవ్వకూడదు. అదే జరిగితే భయాలు, యుద్ధాలు విస్తరిస్తాయి’’ అని లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
ఈసారి సైనిక సహాయం ఇదే!
పెంటగాన్ చీఫ్ హోదాలో చివరిసారిగా లాయిడ్ ఆస్టిన్ జర్మనీలో పర్యటించారు. అక్కడున్న రామ్‌స్టీన్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈసారి సైనిక సహాయంలో భాగంగా ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, గగనతలం నుంచి భూతలం వైపుగా ప్రయోగించే ఆయుధాలు, ఎఫ్-16 యుద్ద విమానాల పరికరాలు, ఆర్మర్డ్ బ్రిడ్జింగ్ వ్యవస్థలు, తుపాకులు, కమ్యూనికేషన్ పరికరాలను ఉక్రెయిన్‌కు అమెరికా అందించనుంది. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక ఆదేశాల అమలులో భాగంగా సత్వరం ఇవన్నీ ఉక్రెయిన్‌కు పంపుతారని తెలుస్తోంది.