Bangladesh Violence Death Toll : బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం జరుగుతున్న ఆందోళనలు చల్లారడం లేదు. హింసాత్మక ఘటనలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా, సైన్యాన్ని మోహరించినా ఫలితం కనిపించడం లేదు. ఘర్షణల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 43 మంది మరణించినట్లు స్థానిక టీవీ ఛానల్ వెల్లడించింది. ఢాకా బోధానాస్పత్రి వద్ద 23 మృతదేహాలను చూసినట్లు మరో వార్తా సంస్థ పేర్కొంది.
అయితే గురువారం 22 మంది మరణించారు. గత మంగళవారం నుంచి మొదలైన ఆందోళనల్లో హింసవల్ల 103 మంది మరణించినట్లు తెలుస్తోంది. వేల మంది గాయపడినట్లు సమాచారం. ఘర్షణలు చల్లారకపోవడం వల్ల కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం నార్సింగిడి జైలు నుంచి 800 ఖైదీలు పారిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఆందోళనకారులు జైలుపై దాడి చేసి నిప్పు పెట్టడం వల్ల ఇదే అదనుగా వారు పారిపోయారు.
హసీనా విదేశీ పర్యటన రద్దు
దేశంలో ఘర్షణల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆమె స్పెయిన్, బ్రెజిల్ వెళ్లాల్సి ఉంది. అలాగే ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆమె చర్చలకు ఆహ్వానించారు.
భారతీయుల తిరిగి రాక
బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 1,000 మంది విద్యార్థులు వచ్చారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా, మరో 200 మంది విమానాల్లో సొంత దేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
ఘర్షణలకు కారణమేంటి?
Bangladesh Violence Reason :ప్రస్తుత కోటా విధానం ప్రకారం 1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో అశువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజ్‌షాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు.