Bangladesh PM House Looted : దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. అందోళనకారులు ప్రధాని అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించి, అక్కడ విధ్వంసం సృష్టించారు. విలువైన వస్తువుల్ని లూటీ చేసినట్లు స్థానిక మీడియా ప్రసారం చేస్తోన్న దృశ్యాల్లో కనిపిస్తోంది. చికెన్, ఫిష్, కూరగాయలు, ఫర్నీచర్, ఇతర విలువైన వస్తువులు పట్టుకుపోయినట్లు పేర్కొన్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన షేక్ హసీనా రాజీనామాతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి, జెండాలు ఊపుతూ మరి వాళ్ల సంతోషం వ్యక్తం చేశారు. ఢాకాలో పార్క్ చేసిన యుద్ధ ట్యాంక్‌పైకి ఎక్కి, డ్యాన్సులు చేశారని అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది.
2018లో అమలు చేయాలని
ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తీసుకువచ్చిన రిజర్వేషన్ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను తేచ్చింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అయితే 2018లోనే ఈ రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అప్పుడు విద్యార్థులు నిరసన తెలియజేయటం వల్ల వెనక్కి తగ్గింది. కానీ, ఈ ఏడాది జూన్‌లో బంగ్లా హైకోర్టులో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువడటం వల్ల మళ్లీ ఆందోళనలు మిన్నంటాయి. తర్వాత మధ్యలో సద్దుమణిగిన నిరసనలు ఆదివారం ఒక్కసారిగా చెలరేగాయి. ఇప్పటివరకు ఈ నిరసనల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.