తెలంగాణ

telangana

ETV Bharat / international

హసీనా గద్దె దిగాక కూడా హింసే- 3రోజుల్లో 232మంది మృతి- ఆజ్యం పోసింది పాకిస్థానే! - Bangladesh Crisis

Bangladesh Crisis Death Toll : బంగ్లాదేశ్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. అవామీ లీగ్‌ ప్రభుత్వం గద్దెదిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. అల్లరిమూకల స్వైరవిహారంతో కేవలం 72గంటల వ్యవధిలోనే 232మంది చనిపోయారు. కోటాకు వ్యతిరేకంగా 20రోజులపాటు జరిగిన అల్లర్లలో కలిపి ఇప్పటివరకు 560 మంది మృతి చెందారు. మరోవైపు ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిన వెంటనే మాజీ ప్రధాని షేక్‌ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తారని ఆమె కుమారుడు తెలిపారు.

Bangladesh Crisis Death Toll
Bangladesh Crisis Death Toll (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 5:14 PM IST

Bangladesh Crisis Death Toll :బంగ్లాదేశ్‌లో ఇంకా హింసాకాండ కొనసాగుతోంది. షేక్‌ హసీనా సారథ్వంలోని అవామీ లీగ్‌ ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత జరిగిన అల్లర్లలో 232 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది. వీరిలో అత్యధికులు ఒక్క మంగళవారం రోజే ప్రాణాలు వదలడం గమనార్హం. తీవ్ర గాయాలతో కొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంతకుముందు బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఘర్షణల్లోనూ దాదాపు 328 మంది ప్రాణాలు వదిలారు. జులై 16 నుంచి ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో చనిపోయివారి మొత్తం సంఖ్య 560కి చేరింది. ఇక గాజీపూర్‌లోని కాశీంపూర్ హైసెక్యూరిటీ జైలు నుంచి మంగళవారం రోజు 209 మంది ఖైదీలు పారిపోయారు. ఖైదీలు పారిపోకుండా జైలు గార్డులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.

షేక్ హసీనా సర్కార్ కూలిపోయిన తర్వాత అవామీలీగ్ పార్టీ శ్రేణులు లక్ష్యంగా పెద్దఎత్తున దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల వల్లే షేక్ హసీనా పార్టీ నాయకులు బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలస వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అవామీ లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకులు దేశం విడిచి పారిపోతుండగా చుడంగాలోని బంగ్లాదేశ్ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌షాహి సిటీ కార్పొరేషన్ వార్డ్ కౌన్సిలర్ రజబ్ అలీతో పాటు అతని సహచరుడు జాకీర్ హుస్సేన్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించారు.

'బంగ్లాదేశ్‌కు ఇది రెండో స్వాతంత్య్రం'
బంగ్లాదేశ్‌‌కు రెండోసారి స్వాతంత్య్రం వచ్చిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ అన్నారు. దేశ పౌరులకు భద్రత కల్పించే ప్రభుత్వాన్ని అందజేస్తామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో గురువారం కొలువుతీరనున్న మధ్యంతర ప్రభుత్వాధినేతగా యూనుస్ ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్ నుంచి దుబాయ్ మీదుగా గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమా, సీనియర్ సైనికాధికారులు, విద్యార్థి నాయకులు, పౌర సమాజ సభ్యులు స్వాగతం పలికారు.

దేశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది
హసీనాకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాన్ని విజయవంతం చేసిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు మహ్మద్ యూనస్. ''దేశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు మీ ఆకాంక్షల మేరకు దాన్ని పునర్నిర్మించాలి. దేశాన్ని నిర్మించడానికి మీరు మీ సృజనాత్మకతను ఉపయోగించాలి. మీరు దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టారు. నిరసనల సమయంలో ఏర్పడిన గందరగోళం నుంచి దేశాన్ని రక్షించాలి. బంగ్లాదేశ్ చాలా అందమైన దేశం. మనం దీన్ని ఏకతాటిపైకి తేగలం. హింసే మన శత్రువు. దయచేసి ఎక్కువ మంది శత్రువులను సృష్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. దేశాన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉండండి' అని ఆయన అని విజ్ఞప్తి చేశారు.

ఇక విద్యార్థి ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో మరణించిన మొదటి వ్యక్తి అబూ సయ్యద్‌కు ఈసందర్బంగా యూనస్ నివాళులర్పించారు. అనంతరం విమానాశ్రయం నుంచి మహ్మద్ యూనస్ నేరుగా ప్రధానమంత్రి అధికారిక నివాసం బంగా భవన్‌కు చేరుకోనున్నారు. గురువారం రాత్రికల్లా కొలువుతీరనున్న తాత్కాలిక ప్రభుత్వంలో 15 మంది సభ్యులు ఉంటారని ఆర్మీ చీఫ్ వకారుజ్జమా వెల్లడించారు. 400 మంది ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ మధ్యంతర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలంపాటు బంగ్లాదేశ్‌ను నడిపించనుందని పేర్కొన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరగడానికి సహకరిస్తుందని తెలిపారు.

అప్పుడే బంగ్లాకు షేక్ హసీనా
బంగ్లాదేశ్‌‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత అక్కడికి షేక్ హసీనా కచ్చితంగా తిరిగి వెళ్తారని ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ గురువారం ప్రకటించారు. భారత్‌కు చెందిన ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిషయాన్ని ఆయన వెల్లడించారు. అయితే బంగ్లాకు క్రియాశీలక రాజకీయ నాయకురాలిగా హసీనా తిరిగి వెళ్తారా ? రిటైర్డ్ రాజకీయ నాయకురాలిగా తిరిగి వెళ్తారా ? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సజీబ్ చెప్పారు. 'షేక్ ముజిబుర్ రెహమాన్ (హసీనా తండ్రి) కుటుంబ సభ్యులు తమ ప్రజలను విడిచిపెట్టరు. ఇబ్బందుల్లో ఉన్న అవామీ లీగ్‌ను కూడా వదిలిపెట్టరు. మా అమ్మను రక్షించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంతర్జాతీయ అభిప్రాయాన్ని పెంపొందించడానికి, ఒత్తిడిని పెంచడానికి మాకు భారత్ సహాయం చేయాలి. తొలుత షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లరని చెప్పాను. కానీ గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా మా నాయకులు, పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను చూసి మా ఆలోచనలో మార్పు వచ్చింది. మా పార్టీ శ్రేణులను సురక్షితంగా ఉంచడానికి మేము ప్రయత్నిస్తాం. వాళ్లను ఒంటరిగా వదిలిపెట్టం'' అని హసీనా కుమారుడు వెల్లడించారు.

పాకిస్థాన్ ఐఎస్‌ఐ ప్రమేయం
బంగ్లాదేశ్‌‌ను మేం అలాగే వదిలేస్తే అది రెండో ఆఫ్ఘనిస్తాన్‌గా మారిపోతుందని, అక్కడ అరాచక పరిస్థితులు ఏర్పడతాయని సజీబ్ అన్నారు. 'త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో ఏకపక్ష వైఖరి తప్పకుండా కనిపిస్తుంది. అందరినీ, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ముందుకు సాగుతామని మహ్మద్ యూనస్ అంటున్నారు. చూద్దాం ఆయన ఏం చేస్తారో ? బంగ్లాదేశ్‌లో అశాంతికి ఆజ్యం పోసింది పాకిస్థానే. ఇందులో పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితమైన ప్రణాళికతో ప్రభుత్వాన్ని కూల్చారు. ఉగ్రవాద సంస్థలు, విదేశీ శక్తులు అందించిన తుపాకులతో అల్లరిమూకలు పోలీసులపై దాడి చేశారు.' అని సజీబ్ తెలిపారు.

లెక్చరర్ టు ప్రభుత్వ సారథి- ఎవరీ మహ్మద్‌ యూనస్? - Bangladesh Crisis

రగులుతున్న బంగ్లాదేశ్​- వెంటాడి, వేటాడి హసీనా పార్టీ నేతల ఊచకోత- హీరోను కూడా వదల్లేదు! - bangladesh crisis Updates

ABOUT THE AUTHOR

...view details