Chinmoy Krishna Das Bail :ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు బంగ్లాదేశ్ కోర్టులో నిరాశ ఎదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. చిన్మయ్ కృష్ణదాస్ తరఫున సుప్రీంకోర్టుకు చెందిన 11మంది న్యాయవాదులు హాజరైనప్పటికీ, ఆయనకు బెయిల్ లభించలేదు.
బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో 30 నిమిషాల పాటు ఈ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. చిన్మయ్ అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలోపెట్టుకొని గురువారం న్యాయస్థానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు త్వరలోనే బెయిల్ కోసం హై కోర్టులో అప్పీల్‌కు వెళ్తామని చిన్మయ్ కృష్ణదాస్ తరుఫున న్యాయవాది అపూర్బ కుమార్ భట్టాచారీ తెలిపారు.
'ఇది దురదృష్టకరం'
ఈ బెయిల్ నిరాకరణపై ఇస్కాన్ కోల్‌కతా ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ స్పందించారు. 'చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్ వస్తుందని అందరం ఆశించాం. గత 42 రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. కృష్ణదాస్‌కు ఆరోగ్యం కూడా మంచిగా లేదని విన్నాం. కానీ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఇది చాలా దురదృష్టకరం. బెయిల్ ఎందుకు తిరస్కరించారో చూద్దాం' అని రాధారమణ్ దాస్ అన్నారు.