Bangladesh Political Crisis : రిజర్వేషన్ల రద్దుకోసం జరిగిన హింసాకాండలో బంగ్లాదేశ్‌లో వందల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా ఈ నిరసన మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ నేతలకు మృత్యుపాశంగా తయారైంది. ఆందోళనకారులు అవామీ లీగ్ నేతలను వెంటాడి, వేటాడి ఊచకోత కోస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ అవామీ లీగ్ నేతల మృతదేహాలు లభ్యమవుతున్నాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం
తాజాగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా 29 మంది మృతదేహాలను గుర్తించారు. అందులో 20 అవామీ లీగ్ నేతలు ఉన్నట్లు మీడియా వెల్లడించింది. సాత్ఖిరా ప్రాంతంలో 10 మంది, కొమిల్లాలో 11 మంది దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అశోక్తలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పుపెట్టినట్లు తెలిపింది. ఇందులో ఐదుగురు టీనేజర్లతో పాటు మొత్తం ఆరుగురు సజీవదహనమయినట్లు తెలుస్తోంది. నటోరె ప్రాంతంలో ఆందోళన కారులు ఒక ఎంపీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ ఇంట్లోని పలు గదులు, బాల్కనీలు, పైభాగంలో తాజాగా మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.
సినీనటుడి హత్య
ఆదివారం నుంచి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు అవామీ లీగ్ పార్టీతో సంబధాలున్నవారిపై దాడులకు తెగబడుతున్నారు. వెంటాడి మరీ వారిని ఊచకోత కోశారు. సోమవారం సైతం ఈ దాడులు కొసాగాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారని తెలియగానే, నిరసన కారులు ఆమె మద్దతుదారులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో యువ నటుడు శాంతో, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు అతికిరాతకంగా చంపారు. నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్‌లో నటించారు.