Mohan Babu University in AP : మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరుపతి సమీపంలోని... మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య తన తాత, నాన్నమ్మ సమాధులకు మంచు మనోజ్ నివాళులు అర్పించారు. ఉదయం మంచు మనోజ్ వర్శిటీ వద్దకు వస్తున్నారన్న సమాచారంతో కళాశాల బయట పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.
భార్య మౌనికతో కలిసి కళాశాల వద్దకు వచ్చిన మనోజ్‌ను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కళాశాల లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని పోలీసులు మనోజ్‌కు చెప్పారు. దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకొని మనోజ్ వెనుదిరిగారు. అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేశ్‌ను కలిశారు. తర్వాత రంగంపేటలో జరుగుతున్న పశువుల పండుగకు వెళ్లారు.
"తాత, నాయనమ్మ సమాధుల దగ్గరకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్‌లో ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నన్ను ఎలా ఆపుతారు. గొడవ చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. అనవసరంగా ఎందుకు ఇష్యూ చేస్తున్నారు. పర్మిషన్ ఇస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తా" -మంచు మనోజ్
తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్, మౌనిక దంపతులు వర్సిటీ వద్దకు రాగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. తాత, నాన్నమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని మనోజ్ పోలీసులకు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల రీత్యా మనోజ్ వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు మరోసారి చెప్పారు. తాత, నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గేట్లు తియ్యండంటూ గేటు వద్ద మనోజ్ బిగ్గరగా కేకలు పెట్టారు.
సీఐతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మనోజ్‌ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు. బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడిన మనోజ్ కళాశాల హాస్టల్ విద్యార్థులను, స్థానికులను కొందరు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో తనను అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జరిగిన పరిణామాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు మనోజ్ తెలిపారు.
'జనరేటర్లో పంచదార'లో ఏమాత్రం నిజం లేదు : మోహన్‌బాబు భార్య లేఖ
జల్పల్లిలో మళ్లీ ఘర్షణకు దిగిన మంచు బ్రదర్స్ - మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు