US on India Canada Issue :సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించడం లేదని అమెరికా ఆరోపించింది. భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. వాటిని భారత్ తీవ్రంగా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలని యూఎస్ కోరుకుంటోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. కానీ, దిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుందని తెలిపారు. "భారత్- కెనడా దౌత్యవివాదంపై ఏమీ మాట్లాడను. కానీ భారత్‌పై కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారత్ వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించాలి. " అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో వ్యాఖ్యానించారు.
భారత ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాల ద్వారా కెనడా పౌరులపై దాడి చేయడానికి, సొంత గడ్డపైనే వారికి అరక్షిత వాతావరణం కల్పించడానికి తన దౌత్యవేత్తలను నియమించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు సహకరించలేదని విమర్శించారు. నిజ్జర్ హత్యకు సంబంధించి వివరాలను అమెరికాకు అందజేసినట్లు ఇటీవల మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా వ్యాఖ్యానించడం గమనార్హం.
'వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతాయి'
భారత్- కెనడా మధ్య ఘర్షణ వేళ కెనడా వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ కెనడా పౌరులను సొంత గడ్డపై బెదిరించడం, వారికి హాని కలిగించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.