America On CAA Notification :పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమను ఆందోళనకు గురిచేస్తోందని తెలిపింది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం చెప్పారు. "మార్చి 11న వచ్చిన CAA నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రం." అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు మిల్లర్ సమాధానమిచ్చారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా, వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ-2019ను తీసుకొచ్చింది. దీనికి 2019లోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించాయి. కానీ, విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన కారణంగా దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు దీని అమలు విధివిధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల ముస్లింల పౌరసత్వం పోదని కేంద్రం స్పష్టం చేసింది.