America Elections 2024 : డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న జో బైడెన్ తొలి విజయాన్ని నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో మిన్నెసొటా ప్రతినిధి డీన్ ఫిలిప్స్, రచయిత మెరియన్ విలియమ్సన్‌పై ఆయన ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బైడెన్, 2020లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. 2024లోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు ఓటమి తప్పదని అన్నారు. కాగా, ఇప్పటికే న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ ప్రైమరీలో ప్రత్యర్థి నిక్కీ హేలీపై డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు.
"2020లో దక్షిణ కరోలినా ప్రజలు తప్పు చేశారని నిరూపించారు. ఇప్పుడు వీరు అందించిన విజయం మా ప్రచారానికి కొత్త ఊపిరి పోసింది. నేను విజయం దిశగా వెళ్లేందుకు ఈ ప్రాంతం ఓటర్లంతా ఏకతాటిపైకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి నన్ను మళ్లీ అధ్యక్షుడిగా మీరు చూడాలనుకుంటున్నారన్న విషయం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు"
--జో బైడెన్, అధ్యక్షుడు