Alexi Navalny Deadbody Case: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని ఓ వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది.
'వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా?'
సాధారణంగా జైల్లో మరణించిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్‌కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో మృతదేహాన్ని క్లినికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ఇదంతా గోప్యతగా ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రతిఒక్కరూ నావల్నీ మృతికి గల కారణం తెలుసుకోవాలనుకుంటున్నారని, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా? అని ఆ వైద్య నిపుణుడు ప్రశ్నించారు.
ఎక్కడికక్కడ అరెస్టులు
నావల్నీ మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరంలో నుంచి తుడిచిపెట్టాలనే అలా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. రష్యా వ్యాప్తంగా ఇప్పటివరకు 400 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు.