Telangana Cyber Security on Fake URL and Sim Cards : సైబర్ నేరగాళ్లు రోజురోజుకు తమ నేరాల తీరును మార్చుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. టెక్నాలజీతో వేల కోట్లు రూపాయలు కొట్టేస్తున్నారు. ఇతరుల పేరు మీద మ్యూల్ సిమ్‌కార్డులు తీసుకుని మెసేజ్‌లు పంపిస్తూ, ఫోన్ కాల్స్ చేస్తూ భయాందోళనకు గురిచేసి ఖాతాలోని డబ్బంతా ఖాళీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు, యూఆర్‌ఎల్‌ల భరతం పట్టేందుకు తాజాగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సాంకేతిక అస్త్రం ప్రయోగిస్తోంది. కేవలం సైబర్ నేరగాళ్లను మాత్రమే అరెస్టు చేయడమే కాకుండా వారు ఉపయోగిస్తున్న వెబ్‌సైట్లు, ఫోన్లు, సిమ్‌లు పనిచేయకుండా నిర్వీర్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో సుమారు 25 వేల సిమ్‌లు, ఐఎంఈఐ నంబర్లను బ్లాక్ చేయగా 1825 నకలీ వెబ్‌సైట్లను నిర్వీర్యం చేసింది. ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని రెండు విభాగాలతో సాధ్యమవుతోంది.
డేటా అగ్రిగేషన్ అనాలసిస్ యూనిట్ : సైబర్ నేరగాళ్లు ఉపయోగించే వెబ్‌సైట్లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, యాప్‌లు, ఈమెయిల్ ఐడీ తదితరాలపై డేటా అగ్రిగేషన్ అనాలసిస్ యూనిట్ దృష్టి సారిస్తోంది. సైబర్ నేరం జరిగిన సమయంలో లభించే సాంకేతిక ఆధారాలతో గూగుల్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు, టెలికాం ఆపరేటర్లను సంప్రదించి నకలీ డేటా మూలాలు సేకరిస్తారు. ఇప్పటివరకు సుమారు 50 వేలకుపైగా యూఆర్‌ఎల్, 40 వేలకుపైగా సిమ్‌కార్డులనును విశ్లేషించినట్లు అధికారులు వెల్లడించారు.
థ్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ : ఎప్పటికప్పుడు జరిగే సైబర్ నేరాల తీరును గమనిస్తూ అప్రమత్తం చేయడం, నేరగాళ్లు ఉపయోగించే యాప్, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు పనిచేయకుండా నిర్వీర్యం చేయడం థ్రెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగం పని. ఉదాహరణకు కారు షోరూం డీలర్‌షిప్ ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు ఫేక్ సోషల్ మీడియా ఖాతా నుంచి వెబ్సైట్ లింక్ పంపి డబ్బులు కొట్టేస్తారు. ఈ సమాచారం ఆధారంగా థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం ఫేక్ సోషల్ మీడియా అకౌంట్, వైబ్‌సైట్‌ను గుర్తించి వాటికి తొలగించాలంటూ సంబంధించిన సంస్థలకు లేఖ రాస్తోంది. కొత్తగా వచ్చే అనుమానాస్పద యాప్‌లు, వాటితో చేసే మోసాలను గమనిస్తూ ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ అప్రమత్తం చేస్తోంది.
న్యూఇయర్ విషెస్ అంటూ లింక్స్ వస్తున్నాయా? - ఇప్పుడు ఇదే సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్
మహానగరిలో మారిన నేరాల తీరు - డిజిటల్ అరెస్టు పేరుతో సరికొత్త మోసాలు