తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒకే ఒక్క 'కత్తెర' వల్ల 36 విమానాలు రద్దు- 200 సర్వీసులు లేట్​- ఏం జరిగిందంటే? - Flights Cancelled Due To Scissors - FLIGHTS CANCELLED DUE TO SCISSORS

Flights Cancelled Due To Scissors : కత్తెర కారణంగా అత్యంత రద్దయిన ఓ విమానాశ్రయంలో ఏకంగా 36 విమానాలు రద్దయ్యాయి. 200 సర్వీసులు ఆలస్యమయ్యాయి. అసలేం జరిగిందంటే?

Flights Cancelled Due To Scissors
Flights Cancelled Due To Scissors (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 3:38 PM IST

Flights Cancelled Due To Scissors :సాధారణంగా వాతావరణం అనుకూలించకపోవడం, ఇతరత్రా భద్రతా కారణాలతో విమాన సర్వీసులు రద్దవుతుంటాయి. కొన్నిసార్లు ఆలస్యం కూడా అవుతుంటాయి. అయితే జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల వందల సంఖ్యలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. మరి దీనికి కారణం ఓ కత్తెర. చదవగానే షాకయ్యారా? అవును కత్తెర వల్లే 36 విమాన సర్వీసులను రద్దు అయ్యాయి.

అసలు విషయమిదే!
జపాన్‌ హక్కైడో ద్వీపంలో ఉన్న న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌లో గత శనివారం (ఆగస్టు 17) ఓ రిటైల్‌ స్టోర్​లో కత్తెర కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల భద్రతా తనిఖీలను ఆపి మరీ దాదాపు రెండు గంటల పాటు దాని కోసం వెతికారు. దీని కారణంగా 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. మరో 201 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

పెద్ద ట్విస్టే!
అయితే ఈ విషయంపై ఎయిర్​పోర్ట్ అధికారులు స్పందించారు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగలించి దాన్ని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని, అందుకే ముందుజాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే అసలు ట్విస్ట్‌ ఏంటంటే చివరకు ఆ కత్తెర కనిపించకుండా పోయిన దుకాణంలోనే దొరికిందట. ఆ స్టోర్‌లో మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

దర్యాప్తునకు ఆదేశం
ఏది ఏమైనా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాలు ఆలస్యం కావడం వల్ల గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. కొందరైతే చేసేదేం లేక ఇంటికి కూడా తిరిగెళ్లిపోయినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్‌ రవాణా మంత్రిత్వశాఖ ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించింది.
1988లో ప్రారంభించిన ఈ న్యూ చిటోస్‌ ఎయిర్‌పోర్ట్‌ హక్కైడోలో అతిపెద్దది. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది ఒకటి. ఇక్కడ భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ కఠినంగా ఉంటాయని దీనికి పేరుంది.

ABOUT THE AUTHOR

...view details