Ukrainians Released From Russia :ఉక్రెయిన్- రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాలు వెల్లడించారు. తమ దేశానికి చెందిన 1358 మంది సైనికులు, పౌరులు రష్యా నుంచి సురక్షితంగా తిరిగొచ్చారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
'2024లో రష్యన్ చెర నుంచి 1358 మంది సైనికులు, పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చాము. ఇందుకు మా సైనికుల బృందం తీవ్రంగా శ్రమించింది. 2025లోనూ ఇలాంటి శుభవార్తలు వినాలని ఉంది' అని జెలెన్‌స్కీ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా రష్యాతో యుద్ధం ముగియాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
యుద్ధం ఆగేనా?
2022 ప్రారంభం నుంచి రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ ఘర్షణల నేపథ్యంలో కీవ్‌లో 39,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడమో, గాయపడటమో జరిగిందని ఐరాసలోని ఉక్రెయిన్ మానవతావాద సమన్వయకర్త మథియాస్ ష్మాలే గతంలో పేర్కొన్నారు. అంతేకాక 3,400 కంటే ఎక్కువ పాఠశాలలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అన్నారు. 10 మిలియన్ల మంది పౌరులు తమ ఇళ్లను వీడినట్లు వెల్లడించారు.
రష్యాకు సాయంగా కొరియా సైనికులు
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఉత్తరకొరియా సైనికులు మాస్కో తరఫున పోరాడుతున్నారు. తొలుత వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి కదనరంగంలోకి దింపినప్పటికీ, భాష సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీవ్ బలగాల చేతుల్లో హతమవుతున్నారని కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తోంది. క్రిస్మస్ సమయంలో కూడా కీవ్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కొత్త సంవత్సరం వేళ ఉక్రెయిన్‌పై భారీస్థాయిలో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కాగా రష్యా దాడుల్లో తమ దేశంలోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశనమైనట్లు అధికారులు తెలిపారు.
పుతిన్‌తో కిమ్‌కు ఉన్న మైత్రి నేపథ్యంలో రష్యా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు పాంగ్‌యాంగ్ తమ సైనికులను బరిలోకి తీసుకొచ్చింది. రష్యాలో శిక్షణ అనంతరం గత కొన్నినెలల నుంచి ఉత్తర కొరియా సైనికులు కుర్స్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నారు. ఆగస్టు నుంచి దాదాపు 12000 మంది ఉత్తర కొరియా సైనికులు ఈ ప్రాంతంలో మోహరించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.