తెలంగాణ

telangana

ETV Bharat / health

వింటర్ స్కిన్ కేర్ టిప్స్- ఇలా చేస్తే చర్మంపై పగుళ్లు పోయి అందం మీ సొంతం! - WINTER SKINCARE TIPS FOR DRY SKIN

మీ చర్మం పొడిబారడం, పగుళ్లు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు సూచన

Winter Skincare Tips for Dry Skin
Winter Skincare Tips for Dry Skin (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 3, 2024, 7:28 AM IST

Winter Skincare Tips for Dry Skin:చలికాలం వచ్చిందంటే.. చర్మం పొడిబారటం, పెదాలు పగలటం, దురద, గోళ్లు పెళుసు బారటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా చర్మం సౌందర్యం చెడిపోయి ఆందోళన పడుతుంటారు. అయితే, తేలికైన చిట్కాలతో వీటిని చాలావరకూ నివారించుకోవచ్చని ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జీఎస్ఎస్ సందీప్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చిట్కాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు.. రోజుకు రెండుసార్లు శరీరానికి మాయిశ్చరైజర్‌ లోషన్లు రాసుకోవాలని డాక్టర్ సందీప్ చెబుతున్నారు. ఇంకా థైరాయిడ్, మధుమేహం జబ్బులు గలవారు, గర్భిణులు, ఆస్థమా మందులు వేసుకునేవారైతే రోజుకు మూడు సార్లు రాసుకోవాలని సూచిస్తున్నారు. సిరామైడ్‌తో కూడిన, ప్రిజర్వేటివ్స్‌ కలపని మాయిశ్చరైజర్‌ లోషన్లు ఎంచుకుంటే మరీ మంచిదని సలహా ఇస్తున్నారు.
  • స్నానం చేసే నీరు గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలనీ.. మరీ ఎక్కువసేపూ స్నానం చేయొద్దని అంటున్నారు. నురుగు తక్కువగా వచ్చే సబ్బులను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే చర్మం తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ పెట్టుకోవాలని వివరించారు. కావాలంటే ముందు కొబ్బరినూనె రాసుకొని, తర్వాత మాయిశ్చరైజర్‌ పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు.
  • పెదవులు పగలకుండా వైట్‌ పెట్రోలియం జెల్లీ గానీ 15 ఎస్‌పీఎఫ్‌ లిప్‌బామ్‌ గానీ రాసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలియం జెల్లీ గోళ్లు పెళుసు బారకుండానూ కాపాడి నిగనిగలాడేలా చేస్తుందని అంటున్నారు. ఎండలో బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నీటి ఆధారిత సన్‌స్క్రీన్స్‌ వాడుకోవాలని సూచిస్తున్నారు.
  • గోరువెచ్చటి నీటితో, నురుగు తక్కువగా వచ్చే షాంపూతో తలస్నానం చేయాలని చెబుతున్నారు. డైమెథికాన్‌ గల కండిషనర్‌ రాసుకుంటే వెంట్రుకలు నిక్క బొడుచుకోకుండా, బిగుసుకోకుండా కాపాడుకోవచ్చని వివరించారు.
  • రాత్రిపూట చల్లటి నీటితో ముఖం కడుక్కొని (సబ్బు లేకుండా) వైట్‌ పెట్రోలియం జెల్లీ రాసుకుంటే చర్మం ఎక్కువసేపు మృదువుగా ఉంటుందని వెల్లడించారు.
  • ముఖం కడుక్కోవటానికి ఫేస్‌వాష్‌కు బదులు నురుగు తక్కువగా వచ్చే క్లెన్సర్స్‌ వాడాలని.. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయన్నారు. మేకప్‌ వేసుకునేవారు క్రీమ్‌ ఆధారిత సాధనాలు వాడుకుంటే మంచిదని.. దీంతో చర్మం పొడి బారకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.
  • మనకు దాహం వేయకపోయినా రోజూ 8-9 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలని, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details