తెలంగాణ

telangana

ETV Bharat / health

గర్భిణీలకు నడుము నొప్పి ఎందుకొస్తుంది? తగ్గడానికి ఏం చేయాలి? - pregnancy back pain tips relief

Why Pregnant Get Back Pain : చాలా మంది గర్భిణీలు నడుము నొప్పితో బాధపడుతుంటారు. ఆ సమయంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అసలు గర్భిణీలకు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలేంటి? ఓసారి తెలుసుకుందాం.

Why Pregnant Get Back Pain
Why Pregnant Get Back Pain

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 5:37 PM IST

Why Pregnant Get Back Pain :గర్భం దాల్చిన తర్వాత మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. గర్భం దాల్చిన కొన్నాళ్లకే తల్లులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య నడుము నొప్పి. ఇది ప్రసవం వరకు వారిని వేధిస్తూనే ఉంటుంది. అసలు ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుందో, దానిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే?
గర్భిణీలకు నడుంనొప్పి రావడానికి ప్రధాన కారణం రిలాక్సిన్ అనే హార్మోన్. ఇది శరీరాన్ని ప్రసవం కోసం సిద్ధం చేస్తుంది. కటివలయం, వెన్నెముక, కీలు, కండరాలు సాగడం లాంటి మార్పులు జరుగుతుంటాయి. దీనికి కారణమైన రిలాక్సిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, దాని వల్ల సంభవించే మార్పుల ఫలితంగా నడుము నొప్పి వస్తుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు తల్లి బరువు పెరగడం, పొట్ట ముందుకు రావడం, పిండం అంతకంతకు పెరగడం లాంటి కారణాలు నడుము నొప్పికి కారణాలని చెప్పవచ్చు. ఇలా శరీరంలో వచ్చే మార్పులతో పాటు మానసిక ఒత్తిడి కూడా నడుము నొప్పికి దారి తీస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Tips To Reduce Back Pain During Pregnancy : గర్భిణీలు నడుము నొప్పితో బాధపడుతున్నా, నొప్పి లేకపోయినా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కూర్చునేటప్పుడు, వంగేటప్పుడు, పడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కూర్చున్నప్పుడు నడుముకు ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వంగాల్సి వచ్చినప్పుడు కాళ్లను వంచి వెన్నముకను నిటారుగా ఉంచాలని చెబుతున్నారు.

పడుకునేటప్పుడు ఒకవైపు తిరిగి పడుకోవడం, పొట్ట కింద దిండు పెట్టుకోవడం, వెన్నెముక వద్ద దిండు పెట్టుకోవడం లాంటివి చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం వ్యాయామాలు చేయవచ్చు. అయితే వైద్యుల సూచనల మేరకే వ్యాయామాలు చెయ్యాలని గుర్తుపెట్టుకోవాలి. హాట్ బ్యాగ్స్ లేదా కోల్డ్ బ్యాగ్స్ వాడి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చటి నీళ్లతో కూడా బ్యాక్ పెయిన్​ను తగ్గించుకోవచ్చు. అలాగే ఫిజియో థెరపిస్ట్​ ద్వారా చిన్నపాటి చికిత్స తీసుకోవచ్చు.

ఇవి అస్సలు చేయవద్దు!
చాలామంది నడుము నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడాలని అనుకుంటారు. కానీ గర్భిణీలకు ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్లు తీసుకోకూడు. నడుము నొప్పి ఎక్కువైనా, పొట్టలో నొప్పిగా అనిపించినా, రెండు వారాలపాటు ఒంట్లో అసౌకర్యంగా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈ చర్మ సమస్యలను త్వరగా గుర్తించండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలా? ఈ ఒక్కటి తింటే చాలు- అంతా సేఫ్!

ABOUT THE AUTHOR

...view details