Reasons for New Borns not Sleep at Night : పగలంతా అమ్మ పక్కనో, ఉయ్యాల్లోనో ఆదమరచి నిద్రపోయే పసిపిల్లలు.. రాత్రయ్యేసరికి హుషారుగా ఉంటారు. కాళ్లు, చేతులు కదుపుతూ ఉత్సాహంగా ఆడుకుంటారు. అర్ధరాత్రి దాటినా వారు నిద్రపోరు.. అమ్మను పడుకోనివ్వరు. దీంతో తల్లులకు నిద్ర కరవవుతుంది. రాత్రంతా పాపాయిని కనిపెట్టుకునే ఉండాల్సి రావడంతో మోహమంతా పీక్కుపోయినట్లు అవుతుంది. చాలినంత నిద్ర లేక కళ్ల కింద నల్లటి వలయాలూ వచ్చేస్తుంటాయి. అసలు, చంటిపిల్లలు (New Borns) రాత్రిపూట ఎందుకు పడుకోరు? అందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముఖం నిండా అమాయకత్వంతో, పెదవులపై విరిసివిరవని చిరునవ్వుతో ముద్దుగా ముగ్దమనోహరంగా కనిపించే పసిపాపలు.. రాత్రి పూట నిద్రపోకపోవడం వెనుక కొన్ని చిన్న చిన్న కారణాలు దాగి ఉన్నాయంటున్నారు పిల్లల వైద్యులు డాక్టర్ పి. షర్మిళ. అవేంటంటే..
ఓవర్ ఫీడింగ్ :రాత్రిపూట చంటిపిల్లలు నిద్రపోకపోవడానికి ఓవర్ ఫీడింగ్ ఒక కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు డాక్టర్ షర్మిళ. ఎందుకంటే.. రీఫ్లక్స్ కారణంగా పాలు ఎక్కువై వెనక్కివస్తుంటాయి. అప్పుడు వారి దృష్టంతా పాలను ఎంతసేపు కక్కకుండా ఉంచుకోవాలనే దానిపైనే ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు కక్కుతుంటారు లేదా మింగుకుంటూ ఉంటారు. దాంతో పిల్లలు సరిగ్గా నిద్రపోరు. ఇది డబ్బా పాలు తాగే పిల్లలో ఎక్కువగా ఉంటుందంటున్నారు.
అండర్ ఫీడింగ్ :పొట్టనిండా అవసరం మేర పాలు తాగకపోయినా, ఫుడ్ తినకపోయినా రాత్రిపూట చంటి పిల్లల్లో స్లీప్ డిస్టర్బెన్స్ ఉండవచ్చంటున్నారు డాక్టర్ షర్మిళ.
ఓవర్ స్టిమ్యులేషన్ : ఇది కూడా పసి పిల్లలు నైట్ టైమ్ త్వరగా నిద్రపోకపోవడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చంటున్నారు. ఎందుకంటే.. ఈ రోజుల్లో పిల్లల్లో ఎక్కువగా మాట్లాడితే మైండ్ బాగా డెవలప్ అవుతారని ఎక్కువగా మాట్లాడిస్తుంటారు పేరేంట్స్. ఇలాంటివి చేసినప్పుడు వారి మైండ్ స్లో డౌన్ అయి.. స్లీప్ మోడ్‌లోకి వెళ్లకుండా ఆగిపోవచ్చు.
ఈ ఓవర్ స్టిమ్యులేషన్ మనుషులు ఇచ్చేది అవ్వొచ్చు. లేదంటే.. బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు ఎక్కువగా ఉండొచ్చు. అంటే.. ఆడిటరీ స్టిమ్యులేషన్. అలాగే.. పిల్లలకు భయపడి కొందరు, తెలియక కొంతమంది రాత్రి సమయంలో ఫుల్ లైట్స్ వేసి ఉంచుతారు. అలా లైట్స్ వేయడం వల్ల విజువల్ స్టిమ్యులేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా కళ్లు, చెవులు, మనసు.. ఇలా ఏదో ఒకటి ఓవర్ స్టిమ్యులేట్ అవుతున్నా రాత్రిపూట చంటిపిల్లల్లో నిద్రకు ఆటంకం ఏర్పడుతుందంటున్నారు డాక్టర్ షర్మిళ.