Why Heart Attack Often Happens Early Morning :ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. అందులోనూ గుండె ఆరోగ్యం ఎంతో కీలకమైంది. ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. అయితే గుండెపోటు వస్తున్న తీరును గమనిస్తే చాలా మందిలో ఉదయం పూటనే ఎక్కువగా గుండెపోటు రావడాన్ని గమనించవచ్చు. అసలు ఉదయం పూటే ఎందుకు ఎక్కువగా గుండెపోటు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూటనే గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేకపోయినా, ఎక్కువ మందికి ఉదయం పూట గుండెపోటు వస్తూ ఉంటుందని సీనియర్ కార్డియాలజిస్ట్ డా.రమేశ్ గూడపాటి తెలిపారు. మరీ ముఖ్యంగా ఉదయం 4 నుంచి 10 గంటల మధ్యలో ఎక్కువ మందికి గుండెపోటు వస్తున్నట్లు చాలా అధ్యయనాల్లో తేలిందని ఆయన చెప్పారు. 'దీనికి కారణం ఉదయం నిద్ర లేచిన తర్వాత మన శరీరం రోజువారీ కార్యక్రమాలకు సిద్ధంగా ఉండటం కోసం స్ట్రెస్ హార్మోన్లు అయిన కార్టిసాల్, కాటెకోలమైన్ ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ సమయంలో హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడం వల్ల రక్తం చిక్కబడటం, రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడడం లాంటవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే తెల్లవారుజామున గుండెపోటు ఎక్కువగా వస్తుంది' అని సీనియర్ కార్డియాలజిస్ట్ డా.రమేశ్ గూడపాటి వివరించారు. అలాగే పీఏ1 అనే ప్రోటీన్ శరీరంలో గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని కరగనివ్వకుండా ఆపుతుందని, దీని వల్ల కూడా గుండెపోటు వస్తుందని ఆయన తెలిపారు.
సోమవారం ఎక్కువ మందికి గుండెపోటు వస్తుంది - ఎందుకు?
'చాలామంది సోమవారం రోజే గుండెపోటుకు గురవుతుంటారు. దీనికి కారణం శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మన మెదడు విశ్రాంతి మోడ్లో ఉంటుంది. సోమవారం పని చేసే రోజుగా ముందే మెదడు, శరీరం ఫిక్స్ అవుతాయి. అందుకే సోమవారం వర్కింగ్ డే అనే ఒత్తిడి వల్ల స్ట్రెస్ హార్మోన్లు ఎక్కువగా విడుదలై, గుండెపోటుకు కారణం అవుతాయి' అని వైద్యులు వివరిస్తున్నారు.
ఇలాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు!
తెల్లవారుజామున గుండె దడగా అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం, ఆయాసంగా అనిపించడం, నొప్పి, అజీర్తిగా అనిపించడం లాంటి లక్షణాలు ఉంటే, వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చాలామంది సాధారణ మంట, నొప్పిగా భావించి నిర్లక్ష్యం వహిస్తుంటారని, దీని వల్ల ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పై లక్షణాలు ఏమి కనిపించినా, వెంటనే వైద్య సాయం పొందాలని సూచిస్తున్నారు.