Telugu actors as Lord Shiva : చాలా మంది తెలుగు ప్రజలకు శ్రీకృష్ణుడు, రాముడు, శివుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఎందుకంటే హిందూ పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ నుంచి బాలయ్య వరకు చాలా మంది దేవుళ్ల పాత్రల్లో మెప్పించారు. మహా శివరాత్రి సందర్భంగా, ఇప్పటివరకూ వెండితెరపై శివుడి పాత్రలో కనిపించిన హీరోలు, సినిమాల గురించి తెలుసుకుందాం.
సీనియర్ ఎన్టీఆర్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్) 'దక్షయజ్ఞం' (1962) సినిమాలో శివుడిగా నటించారు. ఇది ఎన్టీఆర్ 100వ సినిమా కావడం విశేషం. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ'లోనూ ఎన్టీఆర్ శివుడిలా కనిపించారు.
అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా పూర్తి నిడివి ఉండే పాత్ర పోషించలేదు. కానీ 'మూగ మనసులు' (1964)లోని కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించారు.
కృష్ణంరాజు
'శ్రీ వినాయక విజయం'లో కృష్ణం రాజు శివుడి పాత్రలో ఔరా అనిపించారు.
శోభన్ బాబు
సాంఘిక చిత్రాలకు పాపులరైన శోభన్ బాబు కూడా శివుడి పాత్ర పోషించారు. 'పరమానందయ్య శిష్యుల కథ' సినిమాలో శివుడిగా యాక్ట్ చేశారు.
బాలకృష్ణ
జంధ్యాల తెరకెక్కించిన 'సీతారామ కళ్యాణం'లోని ఒక పాటలో కూడా శివుడిగా కనిపించారు బాలయ్య.
చిరంజీవి
కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'శ్రీ మంజునాథ' (2001)లో మెగాస్టార్ చిరంజీవి శివుడిగా నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంబరీష్, అర్జున్ సర్జా, సౌందర్య, మీనా కూడా నటించారు. ఆ తర్వాత 'జగద్గురు ఆదిశంకర' (2013)లో చిరంజీవి మళ్లీ శివుడిగా కనిపించారు. అయితే అంతకుముందు 'పార్వతీ పరమేశ్వరులు', 'ఆపద్భందవుడు' సినిమాల్లోనూ కొన్ని సీన్స్‌లో ఆయన శివుడిగా మెప్పించారు.
శివుడి పాత్రలు చేసిన ఇతర నటులు
మంచు విష్ణు మూవీ 'కన్నప్ప' త్వరలో రిలీజ్ కానుంది. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేశారు. ఈయన అంతకుముందు హిందీలో విడుదలైన 'ఓ మై గాడ్ 2' సినిమాలోనూ శివుడిలా కనిపించారు. 'చిరంజీవులు' చిత్రంలో ఓ సరదా సన్నివేశంలో రవితేజ శివుడిగా కనిపించారు. జగపతి బాబు 'పెళ్లైన కొత్తలో' సినిమాలోని ఓ పాటలో శివుడి వేషధారణలో కనిపించారు. 'శ్రీ సత్యనారాయణ స్వామి' సినిమాలో సుమన్ కూడా త్రినేత్రుడి పాత్ర పోషించారు.
రామకృష్ణ - 'మాయా మశ్చీంద్ర'
రంగనాథ్ - 'ఏకలవ్య'
బాలయ్య - 'కన్నప్ప'
నాగభూషణం - 'నాగుల చవితి', 'ఉమా సుందరి'
రావుగోపాల రావు - 'మా ఊర్లో మహాశివుడు'
రాజనాల - 'ఉషా పరిణయం'
ప్రకాశ్ రాజ్ - 'ఢమరుకం'