Intermittent Fasting for Teenagers: మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా? అయితే, ఈ విషయం మీ కోసమే! తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే టీనేజర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఇది స్వల్ప కాలంలో అన్ని వయసుల వారికి ప్రయోజనమేనని వెల్లడిస్తున్నారు. కానీ, దీర్ఘకాలంలో మాత్రం టైప్ 1 డయాబెటిస్ సూచనలు ఉన్న టీనేజర్లలో ఇన్సులిన్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
జర్మనీలో ఎలుకలపై చేపట్టిన అధ్యయనంలోనూ వ్యతిరేక ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో యుక్త, మధ్య, వృద్ధ ఎలుకలను గ్రూపులుగా విభజించి పరీక్షించారు. 48 గంటల పాటు సాధారణ భోజనం.. మరో 24 గంటల పాటు ఫాస్టింగ్ చేయించి పరిశీలించారు. ఆ తర్వాత చూడగా వారి రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు తేలింది. మరోవైపు దీర్ఘకాలంలో మాత్రం అనేక మార్పులు వచ్చినట్లు బయటపడింది. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వయసు ఎక్కువగా ఉన్న ఎలుకల్లో మెరుగైన ఫలితాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ, తక్కువ వయసున్న ఎలుకల్లో మాత్రం ప్యాంక్రియాటిక్ సెల్ అభివృద్ధిపై ప్రభావం చూపినట్లు వెల్లడిస్తున్నారు. ఫలితంగా టీనేజర్లు, యువతలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.
చాలా మంది బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పద్ధతిని అనుసరిస్తుంటారు. రోజులో లేదా వారంలోనో అప్పుడప్పుడు.. ఒక క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీని ప్రకారం 24 గంటల్లో 16 గంటల పాటు ఉపవాసం పాటించి.. మిగిలిన 8 గంటల సమయంలో ఒకటి లేదా రెండు సార్లు తినాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని.. జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు నిర్థరించారు. కానీ, దీని వల్ల యుక్త వయసు ఉన్న పిల్లల్లో ప్రమాదం ఉందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీర్ఘకాలం పాటు ఫాస్టింగ్ చేయడం వల్ల యుక్త వయసు ఉన్న పిల్లల్లో ప్యాంక్రియాటిక్ సెల్ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే బీటా కణాలపై ప్రభావం చూపుతుందని వెల్లడిస్తున్నారు. అందుకే టీనేజర్లు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే ముందు వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పన్ను నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఇది ప్రొస్టేట్ క్యాన్సర్కు వార్నింగ్! లక్షణాలేంటో తెలుసా?
షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్- చద్దన్నంతో ఎంతో ఆరోగ్యం- అనేక సమస్యలకు చెక్!!