Magha Puranam Chapter 28 : పరమ పవిత్రమైన మాఘ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘ పురాణంలో 28వ అధ్యాయంలో సులక్షరాజు తన పుత్రుని ఏ విధంగా కలుసుకున్నాడో గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం.
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో "ఓ జహ్నువూ! ఓ వైపు బాలుడు అడవిలో శ్రీహరిని పూజిస్తూ కాలం గడుపుతుంటే, మరోవైపు సులక్షణుడు తన చిన్న భార్య కోసం తన పరివారాన్ని పంపించి అంతటా వెతికించినా ప్రయోజనం లేక, చేసేదేమి లేక మిన్నకుండెను.
తల్లి, తండ్రి శ్రీహరియే!
అరణ్యంలో బాలుడు మిక్కిలి జ్ఞానవంతుడై శ్రీహరిని తల్లి, తండ్రిగా, స్నేహితుడిగా, సంకలన బంధువులుగా భావించి, సదా భక్తితో ఆ పుండరీకాక్షుని సేవిస్తూ ఆ తులసి చెట్టునే శ్రీహరిగా భావించి పూజిస్తూ ఆరు మాసములు గడిపాడు. ఎంతకూ శ్రీహరి ప్రసన్నుడు కాకపోవడం వల్ల ఆ బాలుడు విచారంతో ఉండెను.
బాలునికి కర్తవ్యం బోధించిన ఆకాశవాణి
ఒకనాడు ఆకాశవాణి బాలునితో "ఓ రాజపుత్రా! నీకు సమీపంలో ఉన్న సరస్సులో మాఘమాసమున మకరరాశియందు సూర్యుడు ఉండగా ప్రాతఃకాలమున స్నానం చేసి శ్రీహరిని పూజించిన శ్రీహరి ప్రసన్నుడు కాగలడు" అని పలికింది.
బాలునికి శ్రీహరి సాక్షాత్కారం
అశరీరవాణి మాటలు విన్న బాలుడు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సరస్సులో స్నానం చేసి షోడశోపచారాలతో శ్రీహరిని పూజించాడు. మాఘశుద్ధ చతుర్దశి రోజు ఆ శ్రీహరి బాలునికి ప్రత్యక్షమై తన పవిత్ర హస్తాలతో బాలుని స్పృశించి అతనిని ఆలింగనం చేసుకొని కరుణతో ఇట్లు పలికాడు.
శ్రీహరి వరం
బాలునితో శ్రీహరి "బాలకా! నీ భక్తికి మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోమనగా ఆ బాలుడు శ్రీహరితో "జగన్నాథా! నాకు శాశ్వతంగా నీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు" అనగా ఆ శ్రీహరి "బాలుడా! నీవు రాజపుత్రుడవు! నీవు ఈ భూమిని పరిపాలింపుము. మాఘమాస వ్రతమును ఆచరిస్తూ పుత్ర పౌత్రయుతుడవై సమస్త సంపదలతో, వివిధ భోగములతో సుఖముగా జీవించి అంత్యమున నా సన్నిధికి చేరి శాశ్వత కైవల్యమును పొందుతావు" అని వరమిచ్చాడు.
తండ్రిని చేరిన బాలుడు
శ్రీహరి వరం ప్రకారం ఆ బాలుడు అక్కడి ఆశ్రమంలో సునందుడు అనే ముని సహాయంతో తన రాజ్యానికి వెళ్లి తన తండ్రిని కలుసుకుంటాడు. సునందుడు సులక్షునితో బాలుని జన్మ వృత్తాంతం వివరంగా చెప్పి బాలుని రాజుకు అప్పగిస్తాడు. రాజు తన పుత్రుని చూసి ఎంతో సంతోషిస్తాడు. అతనికి సుధర్ముడు అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. పిమ్మట రాజకుమారునికి యుక్తవయసు వచ్చాక సులక్షణుడు రాజ్యభారాన్ని సుధర్మునికి అప్పగించి తన భార్యలతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోతాడు.
జనరంజకంగా సుధర్ముని పాలన
సుధర్ముడు జనరంజకంగా పరిపాలిస్తూ సుందరవతియైన కన్యను వివాహం చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ ప్రజలను కన్నబిడ్డల వలే కాపాడుతుంటాడు. వానప్రస్థానానికి వెళ్లిన సులక్షణుడు వయోభారంతో మరణించగా అతని భార్యలు కూడా సహగమనం చేస్తారు. సుధర్ముడు తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలను ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తాడు.
వైకుంఠాన్ని చేరిన సుధర్ముడు
కాలక్రమంలో సుధర్ముడు ఏటా మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీహరిని పూజిస్తూ భూలోకంలో అనేక భోగాలు అనుభవించి, అంత్యమున వైకుంఠాన్ని చేరుతాడు.
గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షుల సంవాదం
ఈ కథను ఇక్కడ వరకు చెప్పి గృత్స్నమద మహర్షి, జహ్ను మహర్షితో "చూశావుగా జహ్నువూ! శ్రీహరికి ప్రీతికరమగు మాఘమాస వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి ఎన్నడూ ఎటువంటి కష్టం కలుగదు. శ్రీహరి పట్ల భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఈ అధ్యాయాన్ని చదువుతారో, వింటారో వారు ఇహమున సకల భోగాలు అనుభవించి మరణానంతరం వైకుంఠాన్ని చేరుతారు" అంటూ 28వ అధ్యాయాన్ని ముగించాడు.
ఇతి స్కాందపురాణే! మాఘమాస మహాత్యే! అష్టావింశాధ్యాయ సమాప్తః - ఓం నమః శివాయ
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.