Operation Marcos in SLBC Tunnel : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం(ఎస్‌ఎల్‌బీసీ)లో చిక్కుకున్న కార్మికులను కోసం నాలుగు రోజుల నుంచి వెతుకుతున్న వారి జాడ దొరకట్లేదు. దీంతో సొరంగంలో ఇవాళ ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలు చేపట్టే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. ఈ సభ్యులనే మార్కోస్‌గా పిలుస్తారు.
రంగంలోకి ప్రఖ్యాత మెరైన్ కమాండో ఫోర్స్ : మార్కోస్‌తో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో) భాగస్వామ్యం పంచుకోనుంది. ఈమేరకు బీఆర్‌వో లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్‌సింగ్ తన బృంద సభ్యులతో ఇక్కడికి వస్తున్నారు. సొరంగంలో పైకప్పు కుప్పకూలి బుధవారం ఉదయానికి నాలుగో రోజు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యల్లో వేగం పెంచింది. ఈమేరకు కీలక ఆపరేషన్‌కు ఆదేశాలిచ్చింది.
సంక్లిష్టమైనా ఛేదించేలా : సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే ఎనిమిది మంది గల్లంతయ్యారు. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం ఒక ఎత్తు అయితే చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించడం మరొక ఎత్తు. అందుకే ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో గాలించాలని నిర్ణయానికి వచ్చారు.
సహాయక చర్యల్లో ప్రఖ్యాత సంస్థలు : సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, హైవేస్, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, నవయుగ, మేఘా, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్ తదితర బృందాలు సహాయక చర్యలు చేపట్టినా గల్లంతైన వారి ఆచూకీ తెలియట్లేదు. సైన్యం టీబీఎం మధ్య వరకు వెళ్లగలిగినా అక్కడ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. బురద, నీరు, నిర్మాణ సామగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చారు.
కార్గిల్‌తో పాటు కశ్మీర్ ప్రాంతాల్లో : ఎండో బోట్, ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపినప్పటికీ ప్రయోజనం చేకూరలేదు. దాంతో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ మాత్రమే. కార్గిల్‌తో పాటు కశ్మీర్ తదితర ప్రాంతాల్లో సంక్లిష్టతలను తట్టుకుని ఫలితాలను సాధించిన చరిత్ర ఆ సంస్థకు ఉంది. బీఆర్‌వోకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాలు నిర్మాణం, నిర్వహణ రికార్డు ఉంది. దీంతో మార్కోస్, బీఆర్‌వోలతో కలిపి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సొరంగంలోకి వెళ్లనున్నారు.
రేపు మరోసారి టెన్నెల్‌లోకి ర్యాట్ హోల్ మైనర్స్ - జీఎస్‌ఐ, ఎన్‌జీఆర్‌ఐ సాయం కోరిన రాష్ట్రం